మాజీ సార‌థి ధోనీకి అరుదైన గౌర‌వం..

నవతెలంగాణ – హైదరాబాద్: భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆట‌కు వీడ్కోలు ప‌లికి మూడేండ్లు దాటింది. టీమిండియాకు ఆడినన్ని రోజులు ధోనీ భార‌త క్రికెట్‌కు విశిష్ట సేవ‌లందించాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మ‌హీ భాయ్‌కు భార‌త క్రికెట్ బోర్డు అరుదైన గౌర‌వం క‌ల్పించింది. అత‌డు ధ‌రించిన ఏడో నంబ‌ర్ జెర్సీకి వీడ్కోలు ప్ర‌క‌టించింది. ఇక‌పై ధోనీ జెర్సీ నంబ‌ర్‌ని ఎవ‌రికి కేటాయించ‌కూడ‌ద‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది. ఏడో నంబ‌ర్ జెర్సీని మ‌రెవ‌రూ ధ‌రించ‌కూడ‌ద‌ని భార‌త క్రికెట‌ర్ల‌కు తేల్చి చెప్పింది. దాంతో, లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా ధోనీ రికార్డుకెక్కాడు. ప‌దో నంబ‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగిన స‌చిన్ ప్ర‌పంచ క్రికెట్‌లో ప‌రుగుల వీరుడిగా అవ‌త‌రించాడు. అత‌డు రిటైర్మెంట్ ప‌లికిన అనంతరం బీసీసీఐ 10వ నంబ‌ర్‌ను ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకుంది.  ‘ఎంఎస్ ధోనీ ఏడో నంబ‌ర్ జెర్సీని ఎవ‌రూ ఎంచుకోవ‌ద్ద‌ని ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న ఆట‌గాళ్లు, యంగ్‌స్ట‌ర్స్‌కు చెప్పాం. భార‌త క్రికెట్‌కు ఎన‌లేని గుర్తింపు తెచ్చిన మ‌హీ జెర్సీకి వీడ్కోలు ప‌ల‌కాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించ‌డ‌మే అందుకు కార‌ణం. ఇక‌పై కొత్త ఆట‌గాళ్లు నంబ‌ర్ 7 జెర్సీని ధ‌రించ‌లేరు. ఇప్ప‌టికే 10వ నంబ‌ర్ జెర్సీని ప‌క్క‌న పెట్టేశాం. ప్ర‌స్తుతానికి ఆట‌గాళ్ల కోసం 60 సంఖ్య‌లు ఉన్నాయి. ఒక‌వేళ ఏ ప్లేయ‌ర్ అయినా ఏడాదికాలం జట్టుకు దూర‌మైన అత‌డి జెర్నీ నంబ‌ర్‌ను కొత్త‌వాళ్ల‌కు ఇవ్వం. అప్పుడు అరంగేట్రం చేసేవాళ్ల‌కు 30 నంబ‌ర్ల‌లో ఒక‌టి ఎంచుకోవాల్సి వ‌స్తుంది’ అని సీనియ‌ర్ అధికారి ఒక‌రు తెలిపారు. ఇంగ్లండ్ ఆతిథ్య‌మిచ్చిన 2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌తో ధోనీ కెరీర్ ముగిసింది. న్యూజిలాండ్‌తో జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో ర‌నౌట్‌గా వెనుదిరిగిన ధోనీ ఆ క్ష‌ణ‌మే ఆట‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణయించుకున్నాడు. అయితే.. త‌న నిర్ణ‌యాన్ని మాత్రం 2020 ఆగస్టు 15న ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం మ‌హీ భాయ్‌ ఐపీఎల్‌లో కొన‌సాగుతున్నాడు. 16వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను చాంపియ‌న్‌గా నిలిపిన మ‌హీ త‌న కెప్టెన్సీలో ప‌స త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు.

Spread the love