పరువు నష్టం కేసులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ

A setback for Trump in the defamation case– రూ.692 కోట్ల భారీ జరిమానా
న్యూయార్క్‌ : పరువునష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఎదురుదెబ్బ తిన్నారు. మన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు 83.3 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం దాదాపు 692 కోట్ల రూపాయలు) మేర ఆయనకు భారీ జరిమానా విధించింది. ట్రంప్‌ తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అమెరికాకు చెందిన మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ దాఖలు చేసిన కేసులో న్యూయార్క్‌లోని మన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నష్ట పరిహారం కింద దాదాపు 152 కోట్ల రూపాయలు, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా మరో 540 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. కాగా, ఫెడరల్‌ కోర్టు తీర్పు హాస్యాస్పదమన్న ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయిందన్నారు. బైడెన్‌ ప్రభుత్వం న్యాయవ్యవస్థను రాజకీయ ఆయుధంగా వాడుతోందని ఆరోపించారు. ఫెడరల్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేయనున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు.
డీప్‌ ఫేక్‌ కలకలం…!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ … డీప్‌ ఫేక్‌ కాల్స్‌ కలకలం రేపాయి. ఈ ఎన్నికల్లో ఓటెయ్యొద్దు .. అంటూ జోబైడెన్‌ వాయిస్‌తో ఓటర్లకు డీప్‌ ఫేక్‌ కాల్స్‌ వెళ్లాయి. దీనిపై వైట్‌హౌస్‌ స్పందించింది. ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌ కు చెందిన అభ్యంతరకర దృశ్యాలపై కూడా వైట్‌ హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ మాట్లాడుతూ … తప్పుడు చిత్రాలు, సమాచార వ్యాప్తిపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు. సమస్య పరిష్కారానికి చేయగలిగిందంతా చేస్తామని చెప్పారు. ఈ డీప్‌ ఫేక్‌ కాల్స్‌ను కట్టడి చేసే విషయంలో సామాజిక మాధ్యమ సంస్థలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఎక్స్‌(ట్విటర్‌) వంటి సంస్థల్లో నిబంధనలు ఉన్నప్పటికీ.. టేలర్‌ స్విఫ్ట్‌ కు సంబంధించిన అభ్యంతరకర దశ్యాలను తొలగించలేకపోయారని ఆరోపించారు. అవి 17 గంటల పాటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. 45 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ అభ్యంతరకర చిత్రాలపై టేలర్‌ స్విఫ్ట్‌ చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్‌ ఇప్పటికే అయోవా, న్యూ హ్యాంప్‌ షైర్‌లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి నామినేషన్‌ కోసం పోటీపడిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం పోటీ అంతా ట్రంప్‌, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యే ఉంది.

Spread the love