ఓ మహిళా రైతు విజయగాథ

A success story of a woman farmer43ఏండ్ల సువర్ణ భగవాన్‌ పాటిల్‌… వ్యవసాయ జీవితం ఆమెకు కొత్త కాదు. ఓ రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన ఆమె చాలా చిన్న వయసులోనే వ్యవసాయ మెళకువలు నేర్చుకుంది. వివాహం చేసుకొని మరో రైతు కుటుంబంలోకి అడుగుపెట్టింది. అత్తింట్లో కూడా వ్యవసాయంలో తన నైపుణ్యాలను ప్రదర్శించింది. మహారాష్ట్రలోని కొలాపూర్‌ జిల్లా గొండోలి గ్రామంలోని తన 2.5 ఎకరాల భూమిలో అనేక పంటలు పండిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన షుగర్‌ బెల్ట్‌లో భాగంగా ఆమె చెరకు పండిస్తుంది. ఎన్నో ఏండ్లుగా వ్యవసాయంలో అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతుల వల్ల పంట నష్టపోతుందని ఆమె తెలుసుకుంది. దీర్ఘకాల పంట (12-14 నెలలు) కావడంతో చిన్న తరహా రైతు కుటుంబాలకు చెరకు సాగు కష్టతరంగా మారింది. ఇంటెన్సివ్‌ వ్యవసాయ కార్యకలాపాలు, పరిమిత ఆదాయంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే వాతావరణ మార్పులు కూడా వారి కష్టాలు మరింత పెరిగేలా చేసాయి.
మార్పును అంగీకరించినపుడు
వ్యవసాయంలో కొత్త మార్పులు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినపుడు దాన్ని ఎలా కొనసాగించాలనే సందిగ్ధంలో పడింది. అదే సమయంలో అంతర్జాతీయ నెట్‌వర్క్‌ సంస్థ అయిన సాలిడారిడాడ్‌ అండ్‌ దాల్మియా భారత్‌ షుగర్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌  ఆధ్వర్యంలో ఉన్నతి మీఠా సోనా ప్రాజెక్ట్‌ను గ్రామంలో నేల సారాన్ని మెరుగుపరచడంపై శిక్షణా సమావేశం ఏర్పాటు చేశారు. దానిSheTheDifference మహిళా సాధికార సంస్థ చొరవలో భాగంగా కోకా కోలా ఫౌండేషన్‌ నుండి మద్దతు తీసుకున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని నినైదేవిలో  యాజమాన్యంలోని మిల్లుకు చెరకు సరఫరా చేసే సువర్ణ వెంటనే శిక్షణ కోసం చేరిపోయారు. అక్కడ పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతుల గురించి నిపుణులు చెప్పిన విషయాలను ఆమె ఓపికగా విన్నది. వర్మీ కంపోస్టింగ్‌, దాని వల్ల మట్టికి, రైతుకు కలిగే ప్రయోజనాల గురించి చెప్పిన విషయాలు ఆమెకు బాగా నచ్చాయి.
పూర్తి అవగాహన వచ్చింది
నేల అవసరాలేంటి, సాంప్రదాయ పద్ధతుల వల్ల జరుగుతున్న నష్టం ఏంటనే దాని గురించి ఆమెకు శిక్షణా తరగుతుల్లో పూర్తి అవగాహన వచ్చింది. పంటలకు వేసే రసాయన ఎరువుల మోతాదులు ఎక్కువయ్యాయని, ఖర్చు కూడా చాలా ఎక్కువే కాకుండా ఆ ఎరువులు పంటకు హాని కలిగిస్తున్నాయని అర్థం చేసుకుంది. అప్పటి నుండి వర్మీకంపోస్ట్‌పై పూర్తి శ్రద్ధ పెట్టింది. ఎందుకంటే ఒక బయోఫెర్టిలైజర్‌గా, వర్మీకంపోస్ట్‌ సమర్థవంతమైన పరిష్కారమని తెలుసుకుంది. దీనికి ఖర్చు కూడా చాలా తక్కువ. అలా ఆమె 2022లో తన వర్మీకంపోస్టింగ్‌ ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే ఆమెను అంచలంచలుగా ఎదిగేలా చేసింది. రైతు వ్యాపారవేత్తగా మార్చేసింది.
నేల ఆరోగ్యంగా ఉంటేనే…
‘నేను మట్టిని ఆరాధిస్తాను. ఎందుకంటే మనం తినే ఆహారం మట్టి నుండే లభిస్తుందని నాకు తెలుసు. నేను భూమి తల్లిని ప్రేమిస్తున్నాను. నేల ఆరోగ్యంగా ఉంటే దానిపై పండే ఆహారం కూడా నాణ్యంగా ఉంటుంది. తద్వారా ఆ ఆహారాన్ని తినే మానవుల ఆరోగ్యం కూడా బాగుంటుందని నేను అర్థం చేసుకున్నాను. శిక్షణా కార్యక్రమంలో మట్టిపై వర్మీ కంపోస్ట్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుని ఆ యూనిట్‌ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను. దీని వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే వానపాములు, కంపోస్ట్‌లను అమ్మడం వల్ల కూడా నా ఆదాయాన్ని పెంచుకున్నాను’ అని సువర్ణ గుర్తు చేసుకుంది. సువర్ణకు వర్మీకంపోస్ట్‌ బెడ్‌ (లేదా వర్మి-బెడ్‌) ఇచ్చారు. యూనిట్‌లను ఏర్పాటు చేయడానికి నిపుణులైన శిక్షకులు అలాగే సాలిడారిడాడ్‌లోని ఫీల్డ్‌ సిబ్బంది ఆమెకు సహకారం అందించారు. నిపుణుల బృందం ఆమె పొలాన్ని క్రమం తప్పకుండా సందర్శించి నేల పురోగతిని పర్యవేక్షించేవారు. అలాగే ట్రబుల్షూటింగ్‌, యూనిట్లను నిర్వహించడం వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడంలో సహాయం అందించింది.
ఆదాయాన్ని పెంచుకుంది
ఐదు నెలల్లోనే నేల సారంలో మార్పు కనిపించింది. ఒక్క బెడ్‌లో 450 కిలోల వర్మీ కంపోస్టు వచ్చింది. సువర్ణ దీనిని తన చెరకు పంటకు మాత్రమే కాకుండా, తన ఇంటి పెరట్లో పెంచే కూరగాయల మొక్కలకు కూడా ఉపయోగించుకుంది. దీనికి కూడా ఫీల్డ్‌ టీమ్‌ ఆమెకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆమె తన నలుగురు కుటుంబ సభ్యులకు అవసరమైన తాజా వంకాయలు, పచ్చి బఠానీలు, బెండకాయలు వంటి కూరగాయలను పండిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగమైన ఏడాదిలోనే కష్టపడి పనిచేస్తూ రెండు వర్మీ-బెడ్‌ల నుండి 3,200 కిలోల వర్మీ కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టింది. తన పొలంలో వినియోగించిన తర్వాత అదనపు మొత్తాన్ని ఇతర రైతులకు విక్రయిస్తుంది. తద్వారా తన ఆదాయాన్ని రూ.20,000 పెంచుకుంది. తన ఇంటి పశువుల పేడ దాదాపు 5,000 కిలోలు ఉంటుంది. దాన్ని వృధాగా పడేయకుండా వర్మికంపోస్ట్‌ను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది.
సివిల్స్‌కు సిద్ధమౌతున్న కొడుకు కోసం
‘ఈ పద్ధతి మార్కెట్‌ ఎరువుల కోసం చేసే ఖర్చుల నుండి నన్ను కాపాడింది. ఇప్పుడు నా పంటకు నేను తయారు చేసిన వర్మీకంపోస్ట్‌తో పాటు సిఫార్సు చేసిన రసాయన ఎరువుల మోతాదును మాత్రమే ఉపయోగిస్తాను. ఈ విజయం ఆర్థికంగా నన్ను మరింత అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహిస్తుంది. నా అదనపు ఆదాయంలో కొంత భాగాన్ని మరిన్ని వర్మీ-బెడ్‌లను కొనుగోలు చేయడానికి, వర్మి కంపోస్ట్‌ని విక్రయించడానికి ఉపయోగించాలనుకుంటున్నాను’ అని ఆమె వివరిస్తుంది. ప్రస్తుతం సువర్ణ తాను పొదుపు చేసిన డబ్బును సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న తన కొడుకు కోసం ఖర్చు చేయాలనుకుంటుంది.
ఓ చోదక శక్తిగా…
ఓ మహిళా రైతుగా సువర్ణ విజయగాథ ఇతర రైతులకు, మహిళలకు కచ్చితంగా స్ఫూర్తినిస్తుంది. ఆమె తన ప్రాంతంలోని రైతు సమాజంలో ఓ చోదక శక్తిగా మారింది. ‘వర్మి కంపోస్ట్‌కు మారిన తర్వాత నేను నా జీవితంలో తేడాను చూశాను. మా గ్రామంలోని ఇతర మహిళా రైతులు కూడా నా అభివృద్ధిని చూస్తున్నారు. వారు కూడా సొంతంగా వర్మీ-బెడ్‌లను ఏర్పాటు చేసుకుంటే వారి జీవితాల్లో కూడా కచ్చితంగా మార్పు వస్తుందని నేను నమ్ముతున్నాను. తద్వారా వారు కూడా అదనపు ఆదాయాన్ని పొంది మంచి జీవితాన్ని అనుభవించగలరు’ అంటూ ఆమె తన మాటలను ముగించింది.
– సలీమ

Spread the love