పసికూనల సూపర్‌ థ్రిల్లర్‌

పసికూనల సూపర్‌ థ్రిల్లర్‌– ఓమన్‌పై నమీబియా ఉత్కంఠ విజయం
– సూపర్‌ ఓవర్‌లో ఓమన్‌కు తప్పని ఓటమి
– ఓమన్‌ 109/10, నమీబియా 109/6
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అగ్రజట్ల అమీతుమీ ఆరంభం కాకముందే.. పొట్టి కప్పు సమరం హీటెక్కింది. ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా అదరగొట్టగా.. రెండో రోజు పసికూనల పోరు ఉర్రూతలూగించింది. నమీబియా, ఓమన్‌ మ్యాచ్‌ ఆఖరు బంతి వరకు ఉత్కంఠ లేపింది. ఇరు జట్ల స్కోర్లు టై కాగా.. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. సూపర్‌ ఓవర్‌ థ్రిల్లర్‌లో నమీబియా మెరుపు విజయం ఖాతాలో వేసుకుంది. తొలుత ఓమన్‌, నమీబియా 109 పరుగులు చేయగా.. సూపర్‌ ఓవర్‌లో నమీబియా 21 పరుగులు చేయగా.. ఓమన్‌ 10 పరుగులే చేసింది.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
పసికూనల మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌ మరింత ఆసక్తికరంగా మారింది!. సూపర్‌ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో నమీబియా మెరుపు విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో నమీబియా తొలుత 21/0 పరుగులు చేసింది. బిలాల్‌ ఖాన్‌ ఓవర్లో డెవిడ్‌ వైసీ ఓ ఫోర్‌, సిక్సర్‌తో మెరువగా.. ఆ తర్వాత ఎరాస్మస్‌ సైతం రెండు బౌండరీలతో చెలరేగాడు. ఛేదనలో ఓమన్‌ చతికిల పడింది. డెవిడ్‌ వైసీ సూపర్‌ ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. తొలి ఐదు బంతులకు ఓమన్‌ నాలుగు పరుగులే చేసింది. ఆఖరు బంతికి ఆకిబ్‌ సిక్సర్‌ బాదినా.. అప్పటికే నమీబియా విజయం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ఓమన్‌ 19.4 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. డెవిడ్‌ వైసీ (3/28), రూబెన్‌ (4/21) విజృంభించటంతో ఓమన్‌ బ్యాటర్లు చతికిల పడ్డారు. ఖలీద్‌ (34, 39 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), జీసన్‌ మక్సూద్‌ (22, 20 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఛేదనలో నమీబియా జాన్‌ (45, 48 బంతుల్లో 6 ఫోర్లు), నికోలాస్‌ డెవిన్‌ (24, 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిశారు. ఆఖరు ఓవర్లో ఐదు పరుగులు అవసరం కాగా.. నమీబియా నాలుగు పరుగులే చేసింది. దీంతో నమీబియా, ఓమన్‌ స్కోర్లు సమం అయ్యాయి. నమీబియా ఆల్‌రౌండర్‌ డెవిడ్‌ వైసీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఓమన్‌పై విజయంతో నమీబియా గ్రూప్‌-బిలో పాయింట్ల ఖాతా తెరించింది. నమీబియా రెండు పాయింట్లు సాధించి గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
డెవిడ్‌, రూబెన్‌ విజృంభణ : టాస్‌ నెగ్గిన నమీబియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్లు రూబెన్‌ , డెవిడ్‌ చెలరేగటంతో ఓమన్‌ టాప్‌ ఆర్డర్‌ విలవిల్లాడింది. కశ్యప్‌ ప్రజాపతి (0), నసీం ఖుషీ (6), ఆకిబ్‌ (0)లను రూబెన్‌ ఆరంభంలోనే సాగనంపాడు. జీషన్‌ మక్సూద్‌ (22), ఖలీద్‌ (34) నాల్గో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. అయాన్‌ ఖాన్‌ (15) సైతం విలువైన పరుగులు జోడించాడు. మహ్మద్‌ నదీమ్‌ (6), మెహ్రాన్‌ ఖాన్‌ (7), షకీల్‌ (11), ఖలీముల్లా (2) లోయర్‌ ఆర్డర్‌లో ఒక్కో పరుగు జత చేశారు. 19.4 ఓవర్లలోనే ఓమన్‌ కుప్పకూలింది. 109 పరుగులకే ఆలౌటైంది.
జాన్‌ మెరిసినా.. : 110 పరుగుల ఛేదనలో నమీబియా బ్యాటర్లు మెరిసినా.. డెత్‌ ఓవర్లలో ఓమన్‌ బౌలర్లు పుంజుకున్నారు. ఓపెనర్‌ మైకల్‌ వాన్‌ లింగెన్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించినా.. నికోలాస్‌ (24), జాన్‌ (45) రెండో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఆరు ఫోర్లతో మెరిసిన జాన్‌.. నమీబియాను గెలుపు దిశగా తీసుకెళ్లాడు. నికోలాస్‌, జాన్‌లు నిష్క్రమించగా.. నమీబియా ఒత్తిడిలో పడింది. ఎరాస్మస్‌ (13), స్మిత్‌ (8), గ్రీన్‌ (0) నిరాశపరిచారు. ఆఖరు ఓవర్లో డెవిడ్‌ వైసీ (9 నాటౌట్‌) క్రీజులో నిలిచినా.. ఐదు పరుగులు చేయటంలో విఫలమయ్యాడు. 20 ఓవర్లలో 6 వికెట్లకు నమీబియా 109 పరుగులే చేసింది. మెహ్రాన్‌ ఖాన్‌ (3/7) మూడు వికెట్లతో మెరువగా.. బిలాల్‌ ఖాన్‌ (1/25), అకిబ్‌ (1/17) రాణించారు.

Spread the love