దడ పుట్టిస్తున్న ఉల్లి

A throbbing onion– రిటైల్‌ మార్కెట్లో రూ.70 నుంచి 80
– నెల రోజుల్లో నాలుగింతల పెరుగుదల
– సామాన్యుడి పై ధరాభారం
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌
మనం నిత్యం వండుకునే ఏ కూరలో అయినా తప్పని సరిగా ఉల్లి ఉండాల్సిందే. అది వెజ్‌ అయినా… నాన్‌ వెజ్‌ అయినా, అన్నింటిలో కలిసి పోయే గుణం ఉల్లిది. నెల రోజుల క్రితం కిలో రూ.20 పలికిన ఉల్లి ధర నేడు అమాంతం నాలుగు రెట్లు పెరిగి రూ.80కి చేరింది. మార్కెట్లో బంగారంతో సమానంగా ఉల్లి అమ్మకాలు సాగిస్తుంటే సామాన్యుని మెనులో గత కొద్ది రోజులుగా అది మిస్సవుతోంది. డిమాండ్‌, సప్లై అధారంగా నడిచే నేటి మార్కెట్‌ ప్రపంచంలో అయితే అతి వృష్టి, లేకుంటే అనావృషి… ఏ సరుకుల ధరలు ఎప్పుడు ఆకాశాన్నంటుతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు పక్కింటి వాళ్లు ఒక్క ఉల్లి అడిగితే గిన్నె నిండా ఇచ్చే వారు. కాని నేడు సామాన్యుని మొదలుకుని సంపన్నుని వరకు ఉల్లిని దాచి దాచి కూరల్లో వాడుకుంటున్నారు. మొన్న టమాట నేడు ఉల్లి ధరలు సామాన్యులకు కన్నీరు పెట్టిస్తున్నాయి. నెల రోజుల క్రితం 5 కిలోలకు రూ.100 పలికిన ఉల్లి నేడు కిలోన్నరకు వంద పలుకుతోంది. డిమాండ్‌కు సరిపడా ఉల్లి రవాణా లేక పోవడంతో ధర అమాంతం పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. కొత్త పంట వచ్చే వరకు మరో నెల రోజుల పాటు ఉల్లి ధర ఇలాగే ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తగ్గిన సరఫరా
నాలుగు కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ప్రతి నెలా దాదాపు 40 వేల మెట్రిక్‌ టన్నుల ఉల్లి పాయలు అవసరమవుతాయని మార్కెటింగ్‌ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.రాష్ట్ర ప్రజల అవసరాలకు కావల్సిన ఉల్లిలో సగం మాత్రమే స్థానికంగా ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలో ఉల్లిని సాగు చేసే మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, కామారెడ్డి తదితర జిల్లాల్లో సైతం ఈ సారి సాగు విస్త్రీర్ణం తగ్గించడంతో దిగుబడి తగ్గింది. దీనికి తోడు తెలంగాణకు ప్రధాన ఉల్లి సరఫరా చేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు దేశ వ్యాప్తంగా ఉల్లి దిగుబడి తగ్గడంతో నెల కొన్న సంక్షోభ నేపథ్యంలో ఒక్కసారీగా ధరలకు రెక్కలొచ్చాయి. రాష్ట్రంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్‌గా పేరు గాంచిన మలక్‌పేట మార్కెట్‌కు సాధారణ రోజుల్లో 100 మెట్రిక్‌ టన్నుల ఉల్లి దిగుమతి అవుతుంది. కాని గత నెల రోజులుగా సగానికి తగ్గి 50 మెట్రిక్‌ టన్నులకు తగ్గి పోయింది. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నెలకొందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

 

 

 

Spread the love