బీజింగ్‌లో పుతిన్‌కు సాదర స్వాగతం

To Putin in Beijing A warm welcome– చైనా, రష్యా సంబంధాలు
– ప్రపంచ సుస్థిరతకు కీలకం
– ద్వైపాక్షిక సహకారాభివృద్ధిపై చర్చలు
బీజింగ్‌ : చైనా, రష్యాల మధ్య సంబంధాలు ప్రపంచాన్ని సుస్థిరంగా వుంచే అంశంగా మారాయని, ఇతర దేశాలకు మంచి ఉదాహరణగా నిలిచాయని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లు గురువారం పేర్కొన్నారు. ఐదవసారి అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైన తర్వాత పుతిన్‌ మొదటి విదేశీ పర్యటనలో భాగంగా చైనాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజింగ్‌ చేరుకున్నారు.
పుతిన్‌కు సాదరంగా స్వాగతం పలుకుతూ జిన్‌పింగ్‌, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75ఏళ్ళయిందని, ఈ సంవత్సరం 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. ఎన్ని ఒడిదుడుకులు వున్నా ఒక శతాబ్దంలో మూడువంతుల పాటు చైనా-రష్యా సంబంధాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయని పేర్కొన్నారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంబంధాలు కాల పరీక్షకు నిలిచాయన్నారు. పుతిన్‌ తనకు అత్యంత ఆప్త మిత్రుడని వ్యాఖ్యానించారు.
పరస్పరం గౌరవంతో, సహృదయతతో మెలుగుతూ, స్నేహాన్ని కొనసాగిస్తూ, పరస్పర ప్రయోజనాల కోసం పనిచేయడానికి ప్రధాన దేశాలకు, పొరుగు దేశాలకు తమ సంబంధాలు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తాయని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. పుతిన్‌ తాను 40సార్లకు పైగా కలుసుకున్నామని, ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్‌ వుందని చెప్పారు. సంబంధాలు సాఫీగా, నిలకడగా, మంచిగా అభివృద్ది చెందేందుకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేశామన్నారు. చైనా-రష్యా సంబంధాలు ఎంతగానో కష్టపడి సాధించుకున్నవని, వాటిని అభివృద్దిపరుచుకుంటూ ముందుకు సాగడం ఇరు పక్షాలకు కూడా అవసరమని అన్నారు.
చైనా-రష్యా సంబంధాలు నిలకడగా అభివృద్ది చెందుతుండడం ఆ రెండు దేశాల ప్రాధమిక ప్రయోజనాల కోసమే కాకుండా మొత్తంగా ఆ ప్రాంత, విస్తృతంగా ప్రపంచ దేశాల సుస్థిరతకు, శాంతి, సౌభాగ్యాలకు కూడా మంచిదని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. అనంతరం పుతిన్‌ మాట్లాడుతూ, జిన్‌పింగ్‌ తన ప్రియ మిత్రుడని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అవకాశవాదంతో కొనసాగుతున్నవి కావు, పైగా ఏ ఒక్కరికి వ్యతిరేకంగానో ఉద్దేశించినవి కూడా కావన్నది ప్రాధమికంగా కీలకమైన అంశమని చెప్పారు. ఈనాడు ప్రపంచ వ్యవహారాల్లో మా సహకారమనేది అంతర్జాతీయ రంగంలో ప్రధానమైన కీలకాంశాల్లో ఒకటిగా పనిచేస్తుందని అన్నారు. ఉక్రెయిన్‌పై చర్చలకు తాము సిద్ధంగా వున్నామని చెప్పారు. అయితే అటువంటి చర్చలు ఈ ఘర్షణలో ప్రమేయమున్న అన్ని దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితి, బ్రిక్స్‌, ఎస్‌సిఓ, జి-20 వేదికలపై ఇరు దేశాలు విజయవంతంగా సహకరించు కుంటున్నాయని తెలిపారు. ద్వైపాక్షిక సహకారాభివృద్ధికి తన ఈ పర్యటన అదనపు ప్రేరణను, ఉత్సాహాన్ని కలిగిస్తుందని ఆశాభావాన్ని పుతిన్‌ వ్యక్తం చేశారు. అంతకుముందు, చారిత్రక గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ వద్దకు పుతిన్‌ చేరుకోగానే, సాదర స్వాగతం లభించింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పిఎల్‌ఎ) గౌరవ వందనం స్వీకరించారు. దాదాపు 15నిముషాల పాటు సాగిన ఈ కార్యక్రమం అనంతరం ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ప్రధానంగా వాణిజ్యం, ఆర్థిక సహకారంపైనే దృష్టి కేంద్రీకరిస్తారని భావిస్తున్నారు.

Spread the love