గల్ఫ్‌లో కార్మికుడు మృతి

గల్ఫ్‌లో కార్మికుడు మృతి–  పనిచేస్తుండగా స్టాండ్‌ విరగడంతో ప్రమాదం
నవతెలంగాణ-డిచ్‌పల్లి
ఉన్న ఊర్లో ఉపాధి లేక.. బతుకు వేటలో గల్ఫ్‌కు ఉపాధి బాట పట్టిన వలస జీవుల బతుకులు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం దూస్గాం గ్రామానికి చెందిన సురుకుట్ల ప్రవీణ్‌కుమార్‌(30) సౌదీ అరేబియాలో మంగళవారం ప్రమాదవశాత్తు పని ప్రదేశంలో మృతిచెందాడు. దాంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ ఐదేండ్ల క్రితం బతుకు దెరువు కోసం సౌదీ అరేబియాకు ఎలక్ట్రిషన్‌ పనిపై వెళ్లాడు. విధినిర్వహణలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్టాండ్‌ విరగడంతో కింద పడి మృతిచెందాడు. కొద్ది రోజుల క్రితమే సెలవులపై స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్లాడు. ఇంతలోనే మరణవార్త విని కుటుంబీకులు గుండెలవిసేలా రోదిస్తుండటం స్థానికులను కంటతడిపెట్టిస్తుంది. మృతుని భార్య సమత ప్రస్తుతం గర్భిణి. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కాగా, సౌదీలో మృతిచెందిన ప్రవీణ్‌కుమార్‌ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తెప్పించాలని భార్య, బంధువులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ అరవింద్‌, రూరల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డిని కోరారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. దాంతో ఎమ్మెల్యే విచారం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రవీణ్‌కుమార్‌ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు.

Spread the love