తలుపులు, కిటీకీలు మూసుకొని
బయటకు రావద్దు : వాతావరణ శాఖ
మాస్కో: మాస్కోలోని చమురు రిఫైనరీలు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేసిన కొన్ని గంటల్లోనే ఆ ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వందల డ్రోన్లు ఒక్కసారిగా ప్రయోగించడంతో ఆకాశం మొత్తం నల్లగా మారిపోయినట్టు తెలిపాయి. అది నల్లటి ఆమ్ల వర్షమని తెలిపాయి. ఈ వర్షం కారణంగా ప్రజల్లో తలనొప్పి, శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయని భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయని మాస్కో ప్రజలు వెల్లడించారు. వైమానిక దాడుల అనంతరం కురిసే ఆమ్ల వర్షం అత్యంత ప్రమాదకరమని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది సాధారణ ఆమ్ల వర్షం కన్నా హానికరమని పేర్కొంది. ఆమ్ల వర్షాలు కురుస్తుండడంతో తలుపులు, కిటీకీలు మూసుకోవాలని, బయటకు రావద్దని మాస్కో అధికారులు ప్రజలకు సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు ఆ ఆమ్ల వర్షాలు కురుస్తున్న ప్రాంతాలను విడిచివెళ్లాలని కోరారు. గురువారం ఉక్రెయిన్.. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేయడంతో ఈ పరిస్థితులు తలెత్తినట్టు అధికారులు వెల్లడించారు. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో దాదాపు 500లకు పైగా విమాన సర్వీసులు రద్దయినట్టు తెలిపారు.



