నా శరీరం నా శ్వాసలా
నాలోనే పుడుతుంది
నాలోనే వికసిస్తుంది
నేను వేసుకునే బట్ట
నా శరీరంపై నా ఇష్టంతో రాసుకున్న
స్వేచ్ఛ యొక్క రంగు
నా శరీరం – నా హక్కు
అది కేవలం నినాదం కాదు
జీవించి ఉండటానికి ఒక కనీస అర్హత
కానీ నీ కళ్లకు
ఎప్పట్నుంచి ఇతరుల శరీరాల మీద
హక్కు వచ్చిందో చెప్పు
నా కళ్లు – నా ఇష్టం అంటావు
అది ఇష్టం కాదు, అది దాటబడిన గీత
అది అనుమతి లేకుండా ముట్టుకున్న చూపు
నువ్వు చూస్తున్నావు కాదు
నువ్వు కొలుస్తున్నావు
వస్త్రాల పొడవుతో మనిషి గౌరవాన్ని
నీ చూపు ఒక హింసాత్మక దాడి
నీ కామెంట్ ఒక వేటు
అవి గాయాలే గట్టిగా అరవకపోయినా
మర్యాద మరచిన చూపులు
బాధ్యతని విడిచిన మాటలు
మనసుల్ని లోతుగా కోసుకుంటూ..
కళ్ల నుంచి చల్లే యాసిడ్లు
నోటితో విసిరే కత్తులు
వాటికి పేర్లు పెట్టాలి
అవి లోలోపల కార్పించే నెత్తురుతో
బయటికి కార్పించే కన్నీళ్లతో
ఎందుకంటే స్వేచ్ఛ అనేది
ఎదుటి వ్యక్తిని ఎత్తి విసిరేసే
ఈదురు గాలి కాదు
ఇతరుల ఆత్మ గౌరవం వద్ద
వినమ్రంగా వీచే మలయమారుతం
అది హక్కు మాత్రమే కాదు
మరోకరి హద్దును దాటకూడదని
మనసు నేర్చుకోవాల్సిన
నిశ్శబ్ద బాధ్యత దాటితే
అది స్వేచ్ఛ కాదు, దాడి.
ఖదిజ్ఞాసి రజని, 9848030089
కళ్ల నుంచి చల్లే యాసిడ్లు – నోటితో విసిరే కత్తులు
- Advertisement -
- Advertisement -



