‘వెండితెర విషాద కథానాయక’ అనే పేరు సంపాదించుకున్న నటి మీనా కుమారి. ప్రతి ఫ్రేమ్‌లోనూ తనదైన శైలిలో ఆకట్టుకునే అసాధారణ నటనా సామర్థ్యంతో భారతీయ వెండితెరపై చెరగని ముద్ర వేశింది. కుటుంబ బాధ్యతల భారంతో చిన్న వయసులోనే నటనారంగంలోకి అడుగుపెట్టింది. విజయాలు, ప్రజాదరణతో పాటు ఆమెకు ఎన్నో విపత్కర అనుభవాలు, మద్యపాన వ్యసనం కూడా ఎదురయ్యాయి. ఆమె బాల్యం సినిమా స్టూడియోల్లో కళ్లు మండే వెలుగుల నడుమ కనుమరుగైంది. మీనా కుమారిని తరచుగా ‘భారతీయ చిత్రాల సిండ్రెల్లా’ అని పిలుస్తారు. బహుశా ఆమె పడిన కష్టాలే దానికి కారణం కావచ్చు. అనారోగ్యం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు ఆమెను వెంటాడటం కూడా ఒక కారణం కావచ్చు. ఆమె తరచుగా అనాథ బాలిక పాత్రలు పోషించడం కూడా దీనికి మరో కారణం కావచ్చు.
తన మొదటి భార్యను, ముగ్గురు కుమార్తెలను వదిలి వచ్చిన అలీభక్ష్, హిందూ కుటుంబంలో ‘ప్రభావతి’గా జన్మించిన ఇక్బాల్ బేగంను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ ఆ వివాహం వారిని పేదరికంలోకి నెట్టింది. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండేవి, డబ్బు విషయంలో గొడవలు జరిగేవి. అలీ సంగీత దర్శకుడు కూడా. మరోవైపు మీనా చదువుకోవాలని కోరుకునేది. ‘నాకు చదవడం అంటే చాలా ఆసక్తి ఉండేది. స్టూడియోలో ఇతర పిల్లలు ఆవరణలో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, నేను ఒక మూలకు వెళ్లి బాలల పుస్తకాల ప్రపంచంలో లీనమైపోయేదాన్ని’ అని ఆమె తన జీవిత చరిత్రలో చెప్పుకుంది. దర్శకుడు విజరు భట్‌తో మీనా కుమారి నటించిన మొదటి చిత్రం ‘లెదర్ ఫేస్’ కోసం ఆమెకు 25 రూపాయల పారితోషికం లభించింది. ‘ఆమె కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఆమెకు సాధారణ బాల్యం దక్కలేదు. ఆరేండ్ల వయసు నుండే బాలనటిగా ఒక చోట నుండి మరో చోటికి తిరుగుతూ గడపాల్సి వచ్చింది. ఆమె సంపాదించిన డబ్బుతోనే ఆ కుటుంబం జీవనం సాగించేది’ అంటూ వినోద్ మెహతా రాసిన ‘మీనా కుమారి – ది క్లాసిక్ బయోగ్రఫీ’ అన్న పుస్తకంలో ప్రస్తావించారు. మొదటి రోజు సినిమా షూటింగ్‌కు వెళ్ళినప్పుడు అది తన సాధారణ బాల్యానికి ముగింపు కాబోతోందని ఆమె గ్రహించలేదు.
తన కుమార్తెలను బడికి పంపడం అనవసరమని అలీ భావించారు. ఖుర్షీద్, మీనా, మధు అనే తన ముగ్గురు కుమార్తెలూ సినిమాల్లో నటిస్తూ కుటుంబ భారాన్ని మోశారు. అయితే ఇంటి వ్యవహారాలన్నీ అలీ నియంత్రణలోనే ఉండటం, వారు స్వయంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేకపోవడంతో వారికి వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోయింది. 1933 ఆగస్టు 1న దాదర్‌లో మహజబీన్‌గా జన్మించిన మీనా కుమారిని, తల్లిదండ్రులు నాలుగేండ్ల వయసు నుంచే నటించేలా చేశారు. ఆమె తన కుటుంబంతో కలిసి ముంబైలోని దాదర్ చాల్స్‌లో నివసిస్తూ, కనీస జీవన వేతనం కోసం పనిచేసేది. ఆమె అక్క ఖుర్షీద్ అప్పటికే సినిమాల్లో ఉండగా, అలీ వారిద్దరినీ వేషాల కోసం ఒక స్టూడియో నుండి మరో స్టూడియోకు తిప్పేవాడు. మీనా కుమారికి 15 ఏండ్లు వచ్చేసరికి ఆ కుటుంబం చాల్స్ నుండి బయటకు వచ్చి బాంద్రాకు మారడానికి సరిపడా డబ్బు సంపాదించింది. మీనా కుమారి కేవలం నాలుగుండ్ల వయసులో బాల నటిగా ‘లెదర్ ఫేస్’, తర్వాత బాలనటిగా అధూరీ కహానీ, పూజ, ఏక్ హీ భూల్’ వంటివి వాటిలో నటించింది.
‘ఏక్ హీ భూల్’ చిత్రం సమయంలో విజరు భట్ ఆమెకు ‘బేబీ మీనా’ అనే పేరు పెట్టారు. తర్వాత నయీ రోష్నీ, బహెన్, కసౌటీ, విజరు, గరీబ్, ప్రతిజ్ఞ, లాల్ హవేలీ చిత్రాలలో నటించింది. ఆమె బచ్చోం కా ఖేల్ చిత్రంలో మీనా కుమారి అనే పేరుతో నటించింది. 1947లో తల్లి మరణం ఆమె జీవితంలో పెద్దవిషాదం. ఆ తర్వాత తన ఇంటికి ఇక్బాల్ అనే పేరు పెట్టుకుంది. దునియా ఏక్ సరారు, పియా ఘర్ ఆజా, బిచ్డే బాలం వంటి కొన్ని చిత్రాలలో ఆమె నటించడమే కాకుండా పాడిందీ కూడా. 1940ల చివర నాటికి పౌరాణిక, ఫాంటసీ చిత్రాల్లో నటించింది. వీర్ ఘటోత్కచ్, శ్రీ గణేష్ మహిమ, అల్లాదీన్ ఔర్ జాదుయీ చిరాగ్ వంటి చిత్రాలు విజయవంతమయ్యాయి. విజరు భట్ సంగీత భరిత చిత్రం బైజు బావ్రాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ సోదరి ఖుర్షీద్ వివాహం చేసుకుని సినీ ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఇంట్లో తను కేవలం డబ్బు సంపాదించే మనిషిని మాత్రమే అన్న విషయం అర్ధమైన మీనా కుమారి స్వేచ్ఛ కోసం పరితపించింది. కమల్ అమ్రోహిని వివాహం చేసుకోవాలనుకున్న తర్వాతే ఆమెకు అది లభించింది. అయితే తన తండ్రి దీన్ని వ్యతిరేకిస్తాడని తెలిసి రెండు లక్షల రూపాయలు కూడబెట్టి ఆయనకు ఇచ్చే వరకు ఆ రహస్యాన్ని ఆయనకు తెలియకుండా ఉంచాలనుకుంది.
తండ్రికి విషయం తెలిసిన తర్వాత వారిద్దరినీ విడదీయాలని అతను మీనాపై ఒత్తిడి తెచ్చాడు. కానీ ఆమె దఢంగా నిలబడింది. అయితే కుటుంబానికి ఆమె ఒక్కతే ఆధారం కావడంతో ఆయన ఆమెను ఎప్పుడూ వెళ్ళిపొమ్మనలేదు. తర్వాత ఆమె అమ్రోహితో ఒక సినిమాలో నటించేందుకు నిర్ణయించుకున్నప్పుడు తన తండ్రి వ్యతిరేకించాడు. దాంతో అప్పటివరకు ఆమె సంపాదించుకున్న డబ్బు, ఆస్తిని తన చేతుల్లో ఉంచుకున్న తండ్రి దాన్ని మీనాకు తిరిగి ఇవ్వలేదు. ఆమె తన బట్టలు, పుస్తకాలు తప్ప మరేమీ అడగకుండా ఒక లేఖ రాసి ఆ ఇంట్లో నుంచి బయటపడింది. మీనా కుమారి 1938లో కమల్ అమ్రోహీని కలిసింది. అప్పుడు ఆమె బాలనటి. కొన్నేండ్ల తర్వాత ఒక సినిమా సెట్‌లో వారు మళ్లీ కలుసుకున్నారు. కమల్ అమ్రోహీ ఆమెకు తన ‘అనార్కలి’ చిత్రంలో ప్రధాన పాత్రను ఆఫర్ చేశాడు. 1951లో మీనా కుమారికి కారు ప్రమాదం జరిగింది. నాలుగు నెలల పాటు ఆసుపత్రిలో ఉన్నది. ఆ సమయంలో కమల్ అమ్రోహీ తరచుగా ఆమెను పరామర్శించేవాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ చేతి చిటికెన వేలు గాయపడింది. షూటింగ్ సమయంలో ఆమె తరచుగా తన ఎడమ చేతిని స్కార్ఫ్‌తో కప్పి ఉంచేది. 1952 ఫిబ్రవరి 14న మీనా కుమారి, కమల్ అమ్రోహీ రహస్యంగా వివాహం చేసుకున్నారు. మొదట్లో ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు. ఈ వార్త బయటకు వచ్చినప్పుడు తండ్రి ఆమెను విడాకులు తీసుకొమ్మన్నాడు. కానీ మీనా కుమారి తన భర్తతోనే ఉండాలని నిర్ణయించుకుంది.
‘బైజూ బావ్రా’ చిత్రంతో స్టార్‌డమ్ వచ్చిన తర్వాత మీనా కుమారి సినీ జైత్రయాత్ర మొదలైంది. పరిణీత, చాందిని చౌక్, ఆజాద్, మేమ్‌సాబ్, వంటి చిత్రాలతో అగ్రశ్రేణి నాయక స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత శారద, యాహుది, చిరాగ్ కహా రోషిణీ కహా, దిల్ అప్నా ప్రీత్ పరాయ, భాబీకి చుడియా వంటి విజయవంతమైన చిత్రాల వల్ల మీనా కుమారికి ‘ట్రెజెడీ క్వీన్’ అన్న ముద్ర పడింది. ఆ తర్వాత వచ్చిన ‘సాహెబ్ బీబీ ఔర్ గులాం’ చిత్రంలో ఆమె చోటి బహు పాత్రను హిమాలయ శృగంపై నిలబెట్టింది. ఈ సినిమా ఆ రోజులలో ఆస్కార్ సినిమా అవార్డులకు భారతీయ ఎంట్రీగా ఎంపికయింది. ఇక ఏవీఎం వారి మిస్ మేరీ చిత్రంలో ఆమె పోషించిన చలాకి పాత్ర మరుపు రానిది. మీనా కుమారి తన కాలంలో గొప్ప హీరోలందరితోనూ కలిసి నాయకగా నటించి ఆ సినిమాల విజయానికి ప్రధాన కారణమైంది. అశోక్ కుమార్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్, ప్రదీప్ కుమార్, భరత్ భూషణ్, షమ్మీకపూర్, సునీల్ దత్, రాజేంద్రకుమార్, రాజ్‌కుమార్, గురుదత్, జారుముఖర్జీ అంటి వారితో మీనా నాయికగా నటించింది. ఒక్క అశోక్ కుమార్ తోనే మీనా కుమారి 17 సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. 60ల దశకంలో ఆమె అనేక చిత్రాలలో నాయకగా బరువైన పాత్రలు పోషించింది. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేసే క్రమంలో జవాబ్, సాథ్ ఫేరే, గుల్జార్ తొలి డైరెక్షన్ సినిమా మేరే అప్నేలో ఈమెనే ప్రధాన పాత్ర పోషించింది. ఆ తర్వాత వచ్చిన రాజేష్ ఖన్నా ‘దుష్మన్’ చిత్రంలో ఈమె పోషించిన వదిన పాత్ర బాక్సాఫీస్ హిట్టుకు ప్రధాన కారణమైంది. ఆమె తన సినీ జీవితంలో నటించిన సినిమాల సంఖ్య 94.
1963లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో ‘ఉత్తమ నటి’ విభాగంలో మూడు నామినేషన్లు దక్కించుకొని మీనా కుమారి చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు ఫిలింఫేర్ ‘ఉత్తమ నటి’ అవార్డులు గెలుచుకున్న ఆమె రికార్డు 13 ఏండ్లపాటు నిలిచి ఉంది. అత్యధిక నామినేషన్ల విషయంలో ఆమె నెలకొల్పిన రికార్డు 35 ఏండ్ల తర్వాత బద్దలైంది. మరణానంతరం ఫిలింఫేర్ అవార్డుకు ‘పాకీజా’ చిత్రం కోసం నామినేట్ అయిన ఏకైక నటి ఆమె. మీనా కుమారి ఎందరో కొత్త నటీనటులను తారలుగా తీర్చిదిద్దింది. కానీ తాను ప్రేమించిన వారందరిచే నిర్లక్ష్యం చేయబడింది. కమల్ అమ్రోహి కలల ప్రాజెక్ట్ ‘పాకీజా’లో నటించి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ కూడా ఉంది. అవే దుస్తులు సంజరు లీలా భన్సాలీ, ముజఫర్ అలీ వంటి చిత్రనిర్మాతలకు స్ఫూర్తినిచ్చాయి. మీనా కుమారికి కవిత్వం, సాహిత్యం పట్ల కూడా ప్రగాఢమైన ఆసక్తి ఉండేది. ఆమెకు ఇంగ్లీష్, హిందీ భాషలపై కొంత అవగాహన ఉన్నప్పటికీ, ఉర్దూ భాషలో ఆమెకు మంచి పట్టు ఉండేది. మీనా కుమారి సినీ జీవితం ఒక మహారాణిగా సాగింది. కానీ తల్లిదండ్రులకు తాను ఒక కుటుంబ బాధ్యతను మోసే సాధనంగానే కనిపించింది. వివాహం తర్వాత భర్త కమల్ అమ్రోహి కూడా ఆమెను ఓ డబ్బు సంపాదించే యంత్రంగానే భావించాడు. తల్లిదండ్రుల నుండి ఏ ప్రేమ రాహిత్యాన్ని అనుభవించిందో భర్త వద్ద కూడా అంతకు రెట్టింపు వేదనను అనుభవించింది. ఆ తర్వాత ఆమె జీవితంలోకి నటులు, రచయితలు, దర్శక నిర్మాతలు వచ్చి వెళ్లినా వారంతా అవకాశవాదులుగానే మిగిలిపోయారు. ఆమె ఆసరాగా తమ సినీ జీవితాల్ని నిర్మించుకున్నారు తప్ప ఆమె వైపు తిరిగి చూడలేదు. పౌర్ణమి వేళ అమావాస్య చీకటి కురిసినట్లుగా ఆమె జీవితం ముగిసిపోయిన వైనం వచ్చేవారం.
హెచ్.రమేష్ బాబు,
7780736386



