చంద్రయాన్-3పై సినీ నటుల స్పందన

నవతెలంగాణ – హైదరాబాద్
చిరంజీవి:
చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగు పెట్టడం భారత్‌కు కచ్చితంగా అద్భుతమైన విజయమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు. చంద్రయాన్-3 అపూర్వమైన, అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిందని, దీంతో భారత్ చరిత్ర సృష్టించిందన్నారు. శాస్త్రవేత్తలను అభినందిస్తున్న, ఈ సంతోషాన్ని జరుపుకుంటున్న కోట్లాదిమంది భారతీయుల్లో తాను చేరానన్నారు. చంద్రునిపై అమూల్యమైన ఆవిష్కరణలకు, రాబోవు రోజుల్లో మరిన్ని సైంటిఫిక్ మిషన్లకు ఇది మార్గం సుగమం చేస్తుందన్నారు.
నందమూరి బాలకృష్ణ :చంద్రయాన్ -3 విజయవంతానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రుడిపై ఉన్న ఆసక్తికర అంశాలను మానవాళికి అందించడంలో ఇది ముందడుగు అన్నారు. చంద్రుడిపై నివాస యోగ్యత, నీటి లభ్యత, జీవరాసుల మనుగడకు సంబంధించిన సమాచారం ప్రపంచానికి చేరవేయడంలో భారత్ ముందు ఉంటుందన్నారు. ఎన్నో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలను ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి శుభాకాంక్షలు అన్నారు. శాస్త్ర, సాంకేతిక, భౌగోళిక, చంద్రమండల, అంతరిక్ష పరిశోధనల్లో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రకాశ్ రాజ్: చంద్రయాన్-3 విజయవంతం దేశానికి, మానవాళికి గర్వకారణమని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది మన విశ్వం రహస్యాన్ని అన్వేషించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Spread the love