అంబానీని దాటేసిన అదానీ

అంబానీని దాటేసిన అదానీ– ఆసియాలో అత్యంత ధనవంతుడి హోదా
న్యూఢిల్లీ : గౌతమ్‌ అదానీ మళ్లీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఆపిల్స్‌ వ్యాపారం నుంచి ఎయిర్‌పోర్టుల వ్యాపారానికి సంబంధించిన షేర్ల ధరలు పెరగడంతో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీని అధిగమించి మరోసారి ఆసియాలో అత్యధిక ధనవంతుడి హోదాను సంపాదించుకున్నారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ జాబితా ప్రకారం 109 బిలియన్‌డాలర్ల సంపదతో అంబానీ ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానంలో ఉన్నారు. అదానీ 111 బిలియన్‌ డాలర్ల సంపదతో 11వ స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ సమాచారం మేరకు అదానీ గ్రూపు కంపెనీల షేర్లు శుక్రవారం ఏకంగా 14 శాతం పెరిగాయి. శుక్రవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 10 అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ సంస్థల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.17.51 లక్షల కోట్లకు చేరుకుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనంలో ఉన్నప్పటికీ 2022లో తన వ్యక్తిగత సంపద భారీగా పెరగడంతో తొలిసారిగా అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక సృష్టించిన ప్రకంపనలతో గత ఏడాది జనవరిలో అదానీ గ్రూపు సంస్థల షేర్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో అంబానీ మళ్లీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇప్పుడు మళ్లీ అదానీ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. 1988లో సొంతంగా కంపెనీని స్థాపించిన అదానీ సంపద గత పదేళ్లలో భారీగా పెరిగింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు అంటే 2014లో 5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న అదానీ సంపద 2022 చివరి నాటికి 121 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2022లో కొన్ని వారాల పాటు ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.

Spread the love