అడవిలోని జంతువులన్నీ మర్రి చెట్టు కింద సమావేశం అయ్యాయి. వాటికి నాయకత్వం సింహం వహించింది. మగరాజు సింహాసనం మీద కూర్చోగానే జంతువులన్నీ లేచి నిలబడ్డాయి. ఏనుగు గీంకారంతో తొండంతో ఆశీర్వదించింది. సింహం మాట్లాడుతూ ”మీ అభిమానానికి కతజ్ఞతలు, ఓ విషయం మీతో చర్చించాలి అనుకున్నా” అంది.
”ఏమిటది” అంది పులి. మగరాజు అందరి వైపు చూస్తూ. ”ఇంత కాలం మనం ఈ అడవిలో ఒకరికొకరం సహకరించుకుంటూ ఐకమత్యంతో ఉన్నాం. ఈ సందర్బంగా మనం రేపు ఒక పండుగ ఇక్కడ జరుపుకోవాలి అని నా ఆలోచన ఏమంటారు?” అంది. దానికి అన్ని జంతువులు తలలు ఆడించాయి. నక్క మాత్రం ”ఆగండి ఆగండి” అంది. నక్క ఎందుకు అలా అనిందో వాటికి అర్ధం కాక విస్మయంగా చూశాయి.
నక్క వినయంగా ”రేపు అష్టమి. వారం ఆగి ఓ రోజు జరుపుకుందాం. అయినా రేపు అంటే ఏర్పాట్లు కష్టమే అందుకని ఒక వారం రోజుల తర్వాత ఓ మంచి రోజు చూసి జరుపుకుందాం” అంది.
”సరే ఆ ఏర్పాట్లు అన్నీ నువ్వే చేయాలి” అంది ఎలుగు బంటి. ”నేనా” అంది ఆశ్చర్యంగా.
”అవును నువ్వే” అన్నాయి జంతువులు. మగరాజు కూడ ”నువ్వే చేయాలి” అని హుకుం జారీ చేసింది.
కుందేలు మాత్రం నక్క ఎందుకు అలా అనిందో ఆలోచనలో పడింది. మగరాజు లేచి ”ఇక వారం రోజులలో అడవంతా పండుగ వాతావరణంలో ఉండాలి. నక్కకు సహకరించండి. తక్కువ సమయం ఉంది. పండుగే లేని మనకు ఇది పెద్ద పండుగ కావాలి” అని వెళ్ళింది. జంతువులన్నీ తమ నివాసాలకు వెళ్ళుతు ”రేపు మనం పులి ఇంటిదగ్గర కలుద్దాం” అంది ఏనుగు.
అన్నీ వెళ్ళిన తరువాత నక్కకు తెలియకుండా కుందేలు దాని ఇంటి సమీపంలో నక్కింది. అందరూ వెళ్ళిపోయాక నక్క ”అహహ” అంటూ విషపు నవ్వు నవ్వింది. ఆ నవ్వుకు అదిరిపడింది కుందేలు. నక్క చూపులు తీక్షణంగా ఉన్నాయి. పళ్ళు పట పట కొరుకుతోంది. ”మగరాజా! ఇంకా నీకు సింహాసనంపై మక్కువ పోలేదు. నీకు ఇష్టమైన ఆహారంలో విషం కలిపి నీతోనే నేను రాజుగా ప్రకటించబడతాను. అప్పుడు కుందేళ్లను రోజుకొకటి చొప్పున ఎవరికీ తెలియకుండా తినేస్తా. ఈ అడవికి నేనే రాజును. అందరూ నా మాటకు కట్టుబడి ఉండాలి” అని నిద్రలోకి జారుకుంది. మర్రి చెట్టుకింద ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. రంగు కాగితాలతో అందంగా పులి, ఎలుగు అలంకరిస్తున్నాయి. సింహాసనాన్ని ఏనుగు, కుందేళ్లు సర్దుతున్నాయి. నక్క ఊరికే హడావుడి చేస్తోంది. క్రీ గంటగా దాన్ని గమనిస్తోంది కుందేలు.
”ఏర్పాట్లు అన్నీ ముగిశాయి. రేపు మనం ఇక్కడే పండుగ చేసుకుంటాం. భోజనాలకు క్యాటరింగ్ ‘ఆర్డర్ ఇచ్చాను” అంది నక్క. రేపు సరిగ్గా తొమ్మిది గంటలకు మనం సమావేశం ఉంటుంది” అంది ఏనుగు. ఉదయం అన్నీ సమావేశం అయ్యాయి. మగరాజు వస్తుండగా అన్ని చప్పట్లతో లేచి నిలబడ్డాయి. సింహాసనం ఇరుప్రక్కలా కుందేలు, నక్క ఉన్నాయి. అందరిని కూర్చోమని చెప్పింది మగరాజు. వాళ్లను ఉద్దేశించి ”ఇంత కాలం మనం అనొన్యంగా ఉన్నాం. నాకు వయసు అయిపోయింది. మీకు ఓ నాయకుడు అవసరం. మీలో ఎవరు ఆసక్తిగా ఉన్నారు” అంది.
జంతువులన్నీ మౌనంగా ఉన్నాయి. నక్క ముసిముసిగా నవ్వుతోంది. అది గమనించింది కుందేలు. ”మాకు ఎవరికీ నాయకత్వం మీద ఆసక్తి లేదు. మీరు ఎవరు చెబితే వాళ్ళకి అంగీకారం తెలుపుతాం” అంది పులి. ”అవును” అన్నాయి అన్ని.
”ఇక ఈ అడవికి నా తదనంతరం నక్క రాజుగా ఉంటుంది. నాకు సహకరించి నట్లే నక్కకు సహకారం అందించాలి” అంది. ”మీరు ఇంకా కొంత కాలం ఉంటే బాగుంటుంది” అంది కుందేలు. వచ్చిన అవకాశం చేజారి పోతుందేమో అని నక్క అదిరిపడింది. ”సరే ఇక ఆకలి అవుతోంది. భోజనాలు అయిపోయాక మళ్ళీ మాట్లాడుకుందాం” అంది పులి. తొందరగా ఏర్పాట్లు చేయండి అంది ఏనుగు. వండిన పదార్ధాలు అన్నీ తీసుకు వచ్చింది నక్క. జంతువులు తింటుంటే నక్క వెళ్ళి ”మగరాజా మీకు పసందైనా ఆహారం తీసుకు వస్తా” అని వెళ్ళింది. దాని వెనకాలే కుందేలు నడిచింది.
తన ఇంటికి చేరుకున్న నక్క అటుఇటు చూసి గూట్లో పెట్టిన విషం ఆహారంలో కలిపింది. అది కుందేలు చూసి వెంటనే మగరాజు దగ్గరకు వచ్చింది. నక్క ఊల వేసుకుంటూ రెండు ప్లేట్స్‌లో భోజనం పదార్ధాలు తీసుకు వచ్చింది. విషం కలిపిన ఆహారం చూపిస్తూ ”మగరాజా పులిహోర పసందుగా ఉంది తినండి” అంది. మగరాజు తిన బోయేంతలో కుందేలు ”ముందు కళ్ళు మూసుకుని దేవున్ని ప్రార్థిద్దాం” అంది.
”సరే” అని కళ్ళు మూసుకున్నాయి. కుందేలు చాలా తెలివిగా సింహం ముందువున్న పాత్రను మార్చివేసింది.
”హమ్మయ్య ఇక కానిద్దాం” అంటూ తన ముందు ఉన్న పాత్రలో నోరు పెట్టింది. అదే సమయంలో మగరాజు కూడా. కుందేలు నక్కను పరీక్షగా చూస్తోంది. కాసేపటికి నక్క నోటిలో నురగా కక్కుకుంటూ కింద పడిపోయింది.
అడవిలో హహకారాలు మొదలైనవి. మగరాజు అర్ధం కాక చూస్తోంది. కుందేలు కల్పించుకుని ”మిత్రులారా ఈ నక్క గుంట నక్క. మగరాజు ఆహారంలో విషం కలిపింది. తనే రాజు కావాలి అనుకుంది. నాకు ముందునుంచి దీని నడవడి అనుమానం వచ్చి దీన్ని పరీక్షించాను. ఇది మనలో ఉండదగినది కాదు” అంది. వెంటనే పులి కలుగజేసుకుని ”కడివేడు పాలలో రెండు విషపు చుక్కలు కలిపితే ఏమవుతుందో తెలుసు. ఇది గుంటనక్క బుద్ధి పోనిచ్చుకుంది కాదు” అంది. ”తగిన శాస్తి జరిగింది” అంది ఏనుగు. ఎలుగు మాట్లాడుతూ ”కుందేలు తెలివి వలన మన రాజును కాపాడుకున్నాం. ఇది నిజంగా గుంటానక్కే. ఛీ” అంది. మగరాజు సంతోషించి ”నిజంగా ఈ రోజు మనకు పండుగ. మన మధ్యనుంచి గుంట నక్క తొలగిపోయింది. ఈ శుభసందర్భంలో మీకు రాజుగా పులిని నియమిస్తున్న, మంత్రిగా కుందేలు ఉంటుంది. నేను విశ్రాంతి తీసుకుంటా” అంది. జంతువులన్నీ ”ఈ రోజు మనకు నిజమైన పండుగ. పులికి, కుందేలుకు సహకరిస్తాం” అని చప్పట్లు కొట్టాయి. ”ఇక నాకు విశ్రాంతి అవసరం” అని మగరాజు వెళుతుండగా చప్పట్లతో, కేరింతలతో జంతువులు అన్ని ”ఈ రోజు మనకు నిజమైన పండుగ” అన్నాయి.
– కనుమ ఎల్లారెడ్డి,
9391523027