సఫారీకి దాసోహం

Addiction to Safari– ఇన్నింగ్స్‌ తేడాతో భారత్‌ పరాజయం
– తొలి టెస్టులో దక్షిణాఫ్రికా గెలుపు
– మూడు రోజుల్లోనే ముగిసిన ముచ్చట

32 ఏండ్ల నిరీక్షణకు తెరదించే జట్టు అనుకుంటే.. మూడు రోజుల్లోనే చేతులెత్తేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఆఖరు వరకైనా పోరాటం చేయకుండానే సఫారీకి సరెండర్‌ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల లోటుతో రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌సేన.. ఆ లోటూ భర్తీ చేయలేకపోయింది. 34.1 ఓవర్లలో 131 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో సెంచూరియన్‌ టెస్టులో దారుణ పరాజయం చవిచూసింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు కేప్‌టౌన్‌లో జనవరి 3 నుంచి ఆరంభం కానుంది.
నవతెలంగాణ-సెంచూరియన్‌
సెంచూరియన్‌లో టీమ్‌ ఇండియా చేతులెత్తేసింది. పేస్‌ పిచ్‌పై నాణ్యమైన సఫారీ సీమర్లను ఎదుర్కొవటంలో దారుణంగా విఫలమైంది. వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో భారత బ్యాటర్లు వైఫల్యం చెందారు. సఫారీ పేసర్లు అంచనాల మేరకు చెలరేగటంతో తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ ఇండియా 34.1 ఓవర్లలోనే కుప్పకూలింది. 131 పరుగులకే ఆలౌటైన రోహిత్‌ సేన.. తొలి ఇన్నింగ్స్‌ లోటును సైతం అధిగమించలేదు. దక్షిణాఫ్రికా మరోసారి బ్యాట్‌ పట్టే అవసరం లేకుండానే పేసర్లు అపూర్వ విజయాన్ని అందించారు. విరాట్‌ కోహ్లి (76, 82 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో మెరిసినా.. సహచర బ్యాటర్లు ఎవరూ సహకారం అందించలేదు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0), యశస్వి జైస్వాల్‌ (5), శ్రేయస్‌ అయ్యర్‌ (6), కెఎల్‌ రాహుల్‌ (4), అశ్విన్‌ (0)లు విఫలమయ్యారు. సఫారీ అరంగ్రేట పేసర్‌ బర్గర్‌ (4/33) నాలుగు వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌ శతక హీరో డీన్‌ ఎల్గర్‌ (185, 287 బంతుల్లో 28 ఫోర్లు) మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.
జాన్సెన్‌ మెరువగా..: ఓవర్‌నైట్‌ స్కోరు 256/5తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీలు.. భారీ స్కోరు సాధించారు. డీన్‌ ఎల్గర్‌ (185) భారీ శతకంతో మెరువగా.. టెయిలెండర్లు భారత్‌కు అసలైన పంచ్‌ ఇచ్చారు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ డెవిడ్‌ (56, 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. బ్యాటింగ్‌ లైనప్‌ పెవిలియన్‌కు చేరినా.. టెయిలెండర్‌ మార్కో జాన్సెన్‌ (84 నాటౌట్‌, 147 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ అర్థ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా (4/69) నాలుగు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్‌ సిరాజ్‌ (2/91) రాణించాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేయగా.. సఫారీలు 163 పరుగుల భారీ ఆధిక్యం సాధించారు.
పేకమేడలా.. : రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ దారుణ వైఫల్యం చెందింది. కెప్టెన్‌ రోహిత్‌ (0), ఓపెనర్‌ యశస్వి (5)తో మొదలైన పతనం నిరాకంఠంగా సాగింది. టాప్‌ ఆర్డర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (26), విరాట్‌ కోహ్లి (76) మినహా అందరూ తేలిపోయారు. శ్రేయస్‌ అయ్యర్‌ (4) సైతం పెవిలియన్‌కు చేరటంతో భారత్‌ 72/4తో కష్టాల్లో కూరుకుంది. కానీ కోహ్లికి తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ స్టార్‌ రాహుల్‌ (4) తోడవటంతో భారత శిబిరంలో ఆశలు రేగాయి. రాహుల్‌ నిష్క్రమణ తర్వాత భారత పతనం వేగవంతమైంది. బర్గర్‌, జాన్సెన్‌, రబాడ దెబ్బకు భారత విలవిల్లాడింది. అశ్విన్‌ (0), ఠాకూర్‌ (2), బుమ్రా (0), సిరాజ్‌ (4)లు నిరాశపరిచారు. దీంతో మూడు రోజుల్లోనే భారత టెస్టు పోరాటానికి తెరపడింది.
స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 245
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ : 408
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : యశస్వి జైస్వాల్‌ (సి) వెర్రెనె (బి) బర్గర్‌ 5, రోహిత్‌ శర్మ (బి) రబాడ 0, శుభ్‌మన్‌ గిల్‌ (బి) జాన్సెన్‌ 26, విరాట్‌ కోహ్లి (సి) రబాడ (బి) జాన్సెన్‌ 76, శ్రేయస్‌ అయ్యర్‌ (బి) జాన్సెన్‌ 6, కెఎల్‌ రాహుల్‌ (సి) మార్క్‌రామ్‌ (బి) బర్గర్‌ 4, అశ్విన్‌ (సి) డెవిడ్‌ (బి) బర్గర్‌ 0, శార్దుల్‌ ఠాకూర్‌ (సి) డెవిడ్‌ (బి) రబాడ 2, జశ్‌ప్రీత్‌ బుమ్రా రనౌట్‌ 0, మహ్మద్‌ సిరాజ్‌ (సి) వెర్రెనె (బి) బర్గర్‌ 4, ప్రసిద్‌ కష్ణ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (34.1 ఓవర్లలో ఆలౌట్‌) 131.
వికెట్ల పతనం : 1-5, 2-13, 3-52, 4-72, 5096, 6-96, 7-105, 8-113, 9-121, 10-131.
బౌలింగ్‌ : కగిసో రబాడ 12-3-32-2, బర్గర్‌ 10-3-33-4, మార్కో జాన్సెన్‌ 7.1-1-36-3, జెరాల్డ్‌ కోయేట్జి 5-0-28-0.

Spread the love