షకీబ్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది: ఏంజెలో మ్యాథ్యూస్

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో జరిగిన ఏంజెలో మ్యాథ్యూస్ టైమ్డ్ ఔట్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. దీనిపై క్రికెట్ నిపుణులు, నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయి వాదనలకు దిగుతున్నారు. అయితే టైమ్డ్ ఔట్ గురించి మ్యాచ్ అనంతరం మ్యాథ్యూస్ స్పందించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబుల్ హసన్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. “షకీబుల్ హసన్, బంగ్లాదేశ్‌ వ్యవహరించిన తీరు చాలా అవమానకరం. వారు ఇలాగే క్రికెట్ ఆడాలని అనుకుంటే.. అది చాలా తప్పు. చాలా అవమానకరం. ఈ రోజు వరకూ షకీబ్ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని మొత్తం అతను పోగొట్టుకున్నాడు, మా దగ్గర వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. వాటిని బయటపెడతాం”.. అంటూ మ్యాచ్ అనంతరం మ్యాథ్యూస్ వ్యాఖ్యానించాడు.
“నేను ఎలాంటి తప్పు చేయలేదు. క్రీజులోకి వెళ్లి రెడీ అయ్యేందుకు నాకు రెండు నిమిషాల సమయం ఉంది. నేను అలాగే చేశా. అయితే అక్కడికి వెళ్లాక హెల్మెట్ బాగా లేదని గుర్తించా. ఇలాంటి సమయంలో కామన్ సెన్స్ ఎక్కడికి వెళ్లిందో నాకు అర్థం కావడం లేదు. నిజంగా షకీబ్, బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరు ఆమోదయోగ్యం కాదు”.. అంటూ మ్యాథ్యూస్ వాదించాడు. రెండు నిమిషాల లోపలే క్రీజులోకి వెళ్లానన్న మ్యాథ్యూస్.. హెల్మెట్ విరిగిపోయిన విషయాన్ని అప్పుడే గుర్తించానన్నాడు. మరో హెల్మెట్ కోసం కోరిన సమయానికి తనకింకా ఐదు సెకన్ల సమయం ఉందని చెప్పుకొచ్చాడు. హెల్మెట్ లేకుండా బ్యాటింగ్ చేయడం ప్లేయర్ భద్రతకు ఇబ్బందికాదా అంటూ ప్రశ్నించాడు . ఇలాంటి సమయంలో కామన్ సెన్స్‌తో ఎందుకు ఆలోచించరంటూ ప్రశ్నించాడు. సమరవిక్రమ క్యాచ్ పట్టిన సమయం, తాను క్రీజులోకి చేరుకున్న సమయం ఉన్న వీడియో క్లిప్‌ను ట్విటర్‌లో మ్యాథ్యూస్ పంచుకున్నాడు. “నేను నిజంగా ఆలస్యంగా వెళ్లి ఉంటే, రెండు నిమిషాలు దాటిన తర్వాత క్రీజులోకి చేరుకుని ఉంటే నిబంధనల ప్రకారం వెళ్లొచ్చు. నేను రెండు నిమిషాల లోపలే అక్కడకు వెళ్లా. హెల్మెట్ విరిగిపోయింది గుర్తించి మరొకటి తీసుకురమ్మని పిలిచా. అప్పటికి కూడా ఇంకా ఐదు సెకన్లు ఉన్నాయి. అలాగే అంపైర్లు కూడా మా కోచ్‌లతో నా హెల్మెట్ పగిలి ఉండటం గమనించలేదని చెప్పారు. ఇది కేవలం కామన్ సెన్స్‌కు సంబంధించిన విషయం, నేనేమీ మన్కడింగ్ చేయలేదు, ఫీల్డర్లను అడ్డుకోలేదు. ఇలాంటివి గేమ్‌కు అపకీర్తిని తెస్తాయి”.. అంటూ మ్యాథ్యూస్ తన వాదన వినిపించాడు.

Spread the love