ఇంగ్లండ్ కు భారీ షాక్.. వరల్డ్ కప్‌ నుంచి పేసర్ ఔట్

నవతెలంగాణ – హైదరాబాద్: దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో గాయపడ్డ ప్రధాన పేసర్, ఇంగ్లండ్ తరపున ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రీస్ టాప్లీ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా నిష్ర్కమించడం ఖాయమైంది. మ్యాచ్‌లో అతడి చేతి వేలుని బంతి బలంగా తాకడంతో తీవ్రమైన గాయమైంది. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఈ గాయమైంది. వేలు విరిగి ఉండొచ్చని జట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు ఈ టోర్నీకి దాదాపు దూరమైనట్టే కనిపిస్తోంది. టాప్లీ ఇక మళ్లీ పాల్గొనే అవకాశం లేదని ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మోట్ అభిప్రాయపడ్డారు. టాప్లీ వేలు గాయం తీవ్రతను నిర్ధారించడానికి తాము ఇంకా వేచి చూస్తున్నామని, వేలు విరిగినట్టుగా అనిపిస్తోంది, నిర్ధారణ కావాల్సివుందని మోట్ అన్నారు. వేలు చిట్లి ఉంటే అతనికి ఆడటం కష్టతరం అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే టాప్లీ దూరమైతే అతడి స్థానంలో ఇప్పటికే టోర్నీ నిష్ర్కమించిన జోఫ్రా ఆర్చర్‌ను జట్టులోకి తీసుకొస్తారా? ఇంకెవరినైనా తీసుకొస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.

Spread the love