మానవ్ సుతార్ 3 వికెట్ల మాయాజాలం
అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 113/5
భారత్
తొలి ఇన్నింగ్స్ 564/8డిక్లేర్డ్
భారత బ్యాటర్లు అఫ్గాన్ బౌలర్లను ఉతికారేయగా.. భారత బౌలర్లు అఫ్గాన్ బ్యాటర్లను తికమక పెట్టారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (3/21) మ్యాజిక్‌కు అఫ్గాన్ విలవిల్లాడింది. మూడు వికెట్లతో మాయ చేసిన మానవ్ సుతార్.. అఫ్గాన్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. రెహమత్ షా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తుండగా అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 113/5తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 451 పరుగుల వెనుకంజలో నిలిచింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లరేషన్ ప్రకటించింది. రెండో రోజు ఆట ముగిసేసరికి ఏకైక టెస్టులో టీమ్ ఇండియా తిరుగులేని స్థితిలో నిలిచింది.
నవతెలంగాణ-న్యూ చంఢీగడ్
అఫ్గనిస్తాన్‌తో ఏకైక టెస్టులో ఆతిథ్య భారత్ పట్టు బిగించింది. బ్యాటర్లు మెరవటంతో భారీ స్కోరు చేసిన భారత్…బౌలర్ల మెరుపులతో అఫ్గనిస్తాన్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేసేలా సాగుతోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ (3/21) మూడు వికెట్ల మాయ చేయగా, పేసర్ ప్రసిద్ కృష్ణ (2/27) రెండు వికెట్లతో మెరిశాడు. దీంతో అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 39.5 ఓవర్లలోనే 5 వికెట్లకు 113 పరుగులతో కష్టాల్లో కూరుకుంది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రెహమత్ షా (43 నాటౌట్, 81 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగుల భారీ వెనుకంజలో కొనసాగుతుంది. అంతకుముందు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (126, 177 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్), కెఎల్ రాహుల్ (100, 165 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీలకు తోడు రిషబ్ పంత్ (81, 121 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాయి సుదర్శన్ (81, 104 బంతుల్లో 13 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్, 68 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. 127 ఓవర్లలో 8 వికెట్లకు 564 పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్ ప్రకటించింది. అఫ్గాన్ పేసర్ మహ్మద్ సలీమ్ (6/140) ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
మానవ్ మాయాజాలం
ఆరంభంలోనే బంతి అందుకున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ మ్యాజిక్ చేశాడు. తొలి వికెట్‌కు 28 పరుగులు జోడించిన ఓపెనర్లను మానవ్ సుతార్ విడగొట్టాడు. అబ్దుల్ మాలిక్ (16, 18 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడుగా ఆడినా.. మానవ్ మాయకు వికెట్ కోల్పోయాడు. ధనాధన్ బ్యాటర్ రెహ్మనుల్లా గుర్జాబ్ (12, 40 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) సహనంతో ఆడినా.. సుతార్ అతడిని బుట్టలో పడేశాడు. అఫ్సార్ జజాయ్ (3, 26 బంతుల్లో)ను రిటర్న్ క్యాచ్‌తో సాగనంపిన సుతార్ అఫ్గనిస్తాన్‌ను కోలుకోలేని స్థితిలోకి నెట్టాడు. పేసర్ ప్రసిద్ కృష్ణ (2/27) సైతం రెండు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ సెదిఖుల్లా అటల్ (17, 27 బంతుల్లో 3 ఫోర్లు), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20, 48 బంతుల్లో 4 ఫోర్లు)లను ప్రసిద్ కృష్ణ సాగనంపాడు. రెహమత్ షా (43 నాటౌట్) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో బౌలర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేసిన రెహమత్ షా.. అఫ్గాన్ పతనాన్ని నిలువరించాడు. స్వేచ్ఛగా పరుగులు చేసిన రెహమత్ షా క్రీజులో ఉన్నంతసేపు అఫ్గాన్ పోరాటం కొనసాగనుంది. రెండో రోజు ఆట ముగిసేసరికి అఫ్గనిస్తాన్ 39.5 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసింది. చివరి సెషన్ ఆఖరు బంతికి వికెట్ పడగొట్టిన మానవ్ సుతార్.. అప్గనిస్తాన్‌ను మరింత నైరాశ్యంలోకి నెట్టాడు.
సుందర్ అర్థ సెంచరీ
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్ (126), రిషబ్ పంత్ (81) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. పంత్ సైతం సెంచరీ సాధించేలా కనిపించినా.. హష్మతుల్లా షాహిది ఓవర్లో వికెట్ కోల్పోయాడు. ధ్రువ్ జురెల్ (19) ధనాధన్ జోరు నాలుగు ఫోర్లు బాదినా.. వికెట్ కాపాడుకోలేదు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) అర్థ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్ (28, 41 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహ్మద్ సిరాజ్ (22, 12 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆఖర్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. 127 ఓవర్లలో 8 వికెట్లకు 564 పరుగులు చేసిన భారత్ డిక్లరేషన్ ప్రకటించింది. అఫ్గాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ (6/140) ఆరు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) అఫ్సార్ (బి) సలీమ్ 24, కెఎల్ రాహుల్ (సి) గుర్బాజ్ (బి) జియార్ 100, సాయి సుదర్శన్ (సి) అఫ్సార్ (బి) సలీమ్ 81, శుభ్‌మన్ గిల్ (సి) అఫ్సార్ (బి) సలీమ్ 126, రిషబ్ పంత్ (సి) అజ్మతుల్లా (బి) హష్మతుల్లా 81, ధ్రువ్ జురెల్ (బి) సలీమ్ 19, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 52, మానవ్ సుతార్ (సి) అఫ్సార్ (బి) సలీమ్ 28, మహ్మద్ సిరాజ్ (బి) సలీమ్ 22, కుల్‌దీప్ యాదవ్ నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు: 22, మొత్తం : (127 ఓవర్లలో 8 వికెట్లకు) 564.
వికెట్ల పతనం : 1-41, 2-180, 3-247, 4-416, 5-452, 6-456, 7-510, 8-540.
బౌలింగ్ : జియార్ రెహమాన్ 24-2-91-1, అజ్మతుల్లా ఓమర్‌జాయ్ 22-5-67-0, మహ్మద్ సలీమ్ 27-3-140-6, ఖరోటె 23-0-115-0, అబ్దుల్ మాలిక్ 7-0-43-0, హస్మతుల్లా షాహిది 24-1-91-1.
అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ : అబ్దుల్ మాలిక్ (సి) సిరాజ్ (బి) మానవ్ 16, అటల్ (బి) ప్రసిద్ 17, గుర్జాబ్ (సి) సాయి సుదర్శన్ (బి) మానవ్ 12, రెహమత్ షా నాటౌట్ 43, హష్మతుల్లా షాహిది (ఎల్బీ) ప్రసిద్ 20, అఫ్సార్ జజాయ్ (సి,బి) మానవ్ 3, ఎక్స్‌ట్రాలు : 2, మొత్తం : (39.5 ఓవర్లలో 5 వికెట్లకు) 113.
వికెట్ల పతనం : 1-28, 2-4-, 3-62, 4-98, 5-113.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 6-1-24-0, ప్రసిద్ కృష్ణ 7-0-27-2, మానవ్ సుతార్ 15.5-7-21-3, కుల్‌దీప్ యాదవ్ 7-0-20-0, వాషింగ్టన్ సుందర్ 4-0-12-0.



