మళ్లీ ఆఫ్రో-ఆసియా కప్‌?

Afro-Asia Cup again?– ఆఫ్రికా క్రికెట్‌ సంఘం ప్రతిపాదన
న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్‌లో మరో ఆసక్తికర టోర్నమెంట్‌కు అడుగులు పడుతున్నాయి. 2005, 2007లో అభిమానులను విశేషంగా అలరించిన ఆఫ్రో-ఆసియా కప్‌ మళ్లీ జీవం పోసుకోనుంది!. ఇందుకోసం ఆఫ్రికా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) పావులు కదుపుతోంది. శనివారం జరిగిన ఆఫ్రికా క్రికెట్‌ సంఘం వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్టు సమాచారం. ఆఫ్రికా దేశాలన్నీ ఒక జట్టుగా.. ఆసియా దేశాలన్నీ ఓ జట్టు ఏర్పడి తలపడే ఈ టోర్నీలో ఇప్పటివరకు రెండు సార్లు జరిగింది. 2009లో కెన్యాలో షెడ్యూల్‌ చేసిన టోర్నమెంట్‌ జరగలేదు. రెండు దశాబ్దాల అనంతరం ఆఫ్రో ఆసియా కప్‌ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌ క్రికెటర్లు ఐసీసీ ఈవెంట్లలో మినహా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆడటం లేదు. ఆఫ్రో ఆసియా కప్‌ కార్యరూపం దాల్చితే.. భారత్‌, పాకిస్థాన్‌ క్రికెటర్లు కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవాల్సి ఉంటుంది. నిధుల కొరతను అధిగమించేందుకు ఆదాయ మార్గాలు అన్వేషిస్తున్న ఆఫ్రికా క్రికెట్‌ సంఘం.. త్వరలోనే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ఆఫీస్‌ బేరర్లతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏసీసీ అంగీకారం తెలిపితే.. ఆఫ్రో ఆసియా కప్‌ మళ్లీ అభిమానులను అలరించటం ఖాయమే. గతంలో జరిగిన ఆఫ్రో ఆసియా కప్‌లో భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లే, సౌరభ్‌ గంగూలీ, ఎం.ఎస్‌ ధోని, వీరెందర్‌ సెహ్వాగ్‌, జహీర్‌ ఖాన్‌, యువరాజ్‌ సింగ్‌లు షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ యూసుఫ్‌, మహ్మద్‌ అసిఫ్‌లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకున్న సంగతి తెలిసిందే.

Spread the love