ఏజెన్సీలో హైఅలర్ట్‌

Agency on high alert– మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం
– పోలీసుల తనిఖీలు – భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రజలు
నవతెలంగాణ-తాడ్వాయి
దేశంలో పలు రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పోరాటం చేస్తున్న విప్లవ సంస్థలన్నీ ఒకే గొడుగు కిందికి వచ్చి మావోయిస్టు పార్టీగా అవతరించిన రోజునే సెప్టెంబర్‌ 21న ప్రతి ఏటా మావోయిస్టు పార్టీ వార్షికోత్సవాలు నిర్వహిస్తోంది. మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 19 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలంటూ వాల్‌పోస్లర్లు, కరపత్రాలు, లేఖల ద్వారా మావోయిస్టు పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీంతో ఏజెన్సీలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసులు వ్యూహాత్మకంగా అడవుల్లో కూంబింగ్‌ చేస్తున్నారు. ములుగు జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, ఓఎస్‌డి అశోక్‌ కుమార్‌, డిఎస్‌పి రవీందర్‌ ఆదేశాల మేరకు పస్రా సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో తాడ్వాయి ఎస్‌ఐ ఓంకార్‌ యాదవ్‌ రెండ్రోజుల నుంచి మండలంలోని అన్ని గుత్తికోయ గుంపుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శనివారం జలగలంచ, మొండాలతోగు, కొండపర్తి, కామారం గుత్తి కోయ గుడాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. 163 జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేశారు. అనుమానితులు ఎవరైనా సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు. అంతేకాకుండా ప్రభావిత ప్రాంతాల పరిధిలోని పోలీస్‌ ఉన్నతాధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సరిహద్దు అటవీ ప్రాంతాలకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. వందల సంఖ్యలో దండకారణ్యానికి చేరుకుంటున్న సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.

Spread the love