– ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొత్త నాయకుడి ఎంపికలో సరికొత్తగా ఆలోచించింది. నాయకత్వంలో మంచి అనుభవం కలిగిన డుప్లెసిస్, కెఎల్ రాహుల్‌ను కాదని యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. రూ.16.50 కోట్లకు అక్షర్ పటేల్‌ను అట్టిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్..రూ.14 కోట్లతో రాహుల్, రూ.11.75 కోట్లతో స్టార్క్‌ను వేలంలో తీసుకుంది. గత సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో మ్యాచ్‌కు సారథ్యం వహించిన అక్షర్ పటేల్.. దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్‌కు వైట్‌బాల్ ఫార్మాట్‌లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్.. ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించటం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. క్రికెటర్‌గా ఎదిగాను, నాయకుడిగా ముందుండి నడిపించేందుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధంగా ఉన్నానని’ అక్షర్ తెలిపాడు. ఐపీఎల్18లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి రెండు మ్యాచులను విశాఖపట్నంలో ఆడనుంది. ఈ నెల 24న వైజాగ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 14 పాయింట్లే సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.