సెమీస్‌లో అల్కరాస్‌

Alcaraz in the semis– కాస్పర్‌ రూడ్‌కు వాకోవర్‌
– ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
పారిస్‌ (ఫ్రాన్స్‌) : ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ వేట ఆసక్తికరంగా మారింది. టాప్‌ సీడ్‌, డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ ఫిట్‌నెస్‌ కారణాలతో టోర్నీ నుంచి నిష్క్రమించగా.. యువ ఆటగాళ్లు రొలాండ్‌ గారోస్‌ గ్రాండ్‌స్లామ్‌ వేటలో దూకుడు పెంచారు. మూడో సీడ్‌ కార్లోస్‌ అల్కరాస్‌ గార్ఫియ (స్పెయిన్‌) సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో గ్రీసు కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌పై వరుస సెట్లలోనే విజయం సాధించాడు. 6-3, 7-6(7-3), 6-4తో సిట్సిపాస్‌ను చిత్తు చేశాడు. నాలుగు బ్రేక్‌ పాయింట్లు సాధించిన అల్కరాస్‌కు రెండో సెట్‌ మినహా సిట్సిపాస్‌ పెద్దగా ప్రతిఘటన ఇవ్వలేదు. పాయింట్ల పరంగా 101-81తో అల్కరాస్‌ పైచేయి సాధించాడు. సొంత సర్వ్‌లో అల్కరాస్‌ 14 గేములు గెల్చుకోగా.. సిట్సిపాస్‌ 12 మాత్రమే గెలుపొందాడు. రెండో సెట్‌ టైబ్రేకర్‌కు దారితీయగా ఒత్తిడిలో పైచేయి సాధించిన అల్కరాజ్‌ అలవోక విజయంతో సెమీఫైనల్‌ బెర్త్‌ బుక్‌ చేసుకున్నాడు. ఇక టాప్‌ సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ వాకోవర్‌తో నార్వే ఆటగాడు కాస్పర్‌ రూడ్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. రాకెట్‌ పట్టకుండానే క్వార్టర్‌ఫైనల్‌ దాటేసిన కాస్పర్‌ రూడ్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో అలెక్స్‌ (ఆస్ట్రేలియా) పోటీపడనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో జాస్మిన్‌ పావలిన్‌ (ఇటలీ) సెమీఫైనల్స్‌కు చేరుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో నాల్గో సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌)పై మూడు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించింది. 6-2, 4-6, 6-4తో టైటిల్‌ ఫేవరేట్‌ను చిత్తు చేసింది. రిబకినా పది ఏస్‌లు కొట్టినా.. జాస్మిన్‌ వెనక్కి తగ్గలేదు. ఏడు బ్రేక్‌ పాయింట్లతో రిబకినా (ఐదు బ్రేక్‌ పాయింట్లు)పై పైచేయి సాధించింది. పాయింట్ల పరంగా 97-83తో జాస్మిన్‌ మెప్పించింది.

Spread the love