అలిగావా మల్లన్నా..!

కొంతమంది రాజకీయ నాయకులు చెప్పేదానికి చేసేదానికి సంబంధముండదు. అయినా స్టేట్‌మెంట్లు ఇస్తూనే ఉంటారు. నవ్వులపాలవుతూనే ఉంటారు. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా..నిష్క్రమిస్తా అంటూ ప్రకటనలిస్తుంటారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తాజాగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించి పతాక శీర్షికలకెక్కారు. దీనిపై నెటిజన్లు వెరైటీగా కామెంట్లు గుప్పిస్తున్నారు. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేవిగానూ, మరికొన్ని జోకులుగానూ ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రజల మీద అలిగారా? లేక బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌పై అలిగారా? మల్లన్న. మీరు కబ్జా చేసిన భూముల్లో నిర్మించిన గోడలను సీఎం రేవంత్‌ సర్కారు కూల గొడు తుంటే భయపడి అలా అన్నారా? ఆ బాధలో మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. మీరు పదవి లేకుండా ఉండగలరా? అది మేము నమ్మలా? మీ చేతలకు, మీ మాటలకు ఎక్కడా పొంతన ఉండదు. మీ మాటల్లో సీరియస్‌ ఉండదు. చివరకు అసెంబ్లీలోనూ పెద్ద కామెడియన్‌ పాత్ర పోషించితిరి. పూలమ్మినా..పాలమ్మినా..అని పెద్ద జోక్‌ చెప్పితివి. పూలు, పాలమ్మేటోళ్లు ఎంతో మంది ఉన్నారు. వారంతా వేల కోట్ల రూపాయలు ఎందుకు సంపాదించ లేదు. ఆ ట్రిక్‌ ఏందో చెప్పండి అంటూ నెటిజన్లు ఎన్నోసార్లు ప్రశ్నలడిగితే ముఖం చాటేశారు. మీరు పోటీ చేయకపోతే ఎన్నికలు ఆగిపోతాయా? భూమి కుంగిపోతుందా? వానలు పడవా? ఇవేవీ జరగవు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేయనంత మాత్రాన అభ్యర్థులే దొరకరా?అంటూ జోకులు వేసుకుంటున్నారు.
– గుడిగ రఘు

Spread the love