గురుకులాల్లో అన్నీ స‌మ‌స్య‌లే..

All the problems in Gurukuls..– మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం
– రోగాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు
– బడ్జెట్‌ విడుదలలో సర్కారు నిర్లక్ష్యం
– పేరుకు పోయిన బకాయిలు
– పలచబడుతున్న మెనూ
– పౌష్టికాహారం ఉత్తమాటే..
– ఈ ఏడాదైనా పరిష్కారం అయ్యేనా?
– విద్యార్థుల్లో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో పేదోళ్ల పిల్లలే పెద్ద ఎత్తున చదువుకుంటున్నారు. వారి సంక్షేమం, విద్యాభివృద్ధికి గురుకులాలు ఎంతగానో తోడ్పాటునందిస్తున్నాయని ప్రభుత్వాలు గొప్పగా చెప్పకుంటున్నాయి. కానీ..వాటిని అభివృద్ధి చేయటంలో ప్రభుత్వాలు తగిన రీతిలో ఆసక్తి కనపర్చటం లేదు. ‘నాసి రకం ఆహారంతో విద్యార్థులకు అనారోగ్యం’, ‘గురుకులం..రోగాల కలకలం’, ‘ గురుకుల విద్యార్థులకు అస్వస్థత’, ‘బాత్రూంలు లేక అవస్థలు’, ‘తిరగని ఫ్యాన్లు..నీళ్లురాని నళ్లాలు’ ఇత్యాది శీర్శికలతో బ్యానరు వార్తలు రాష్ట్రంలోని ఏదో ఒక గురుకులం నుంచి అచ్చవుతున్న తీరు సాధారణంగా మారింది.
కొత్త సర్కారు..సమస్యలు తీర్చేనా?
కొత్త సర్కారు కొలువుదీరింది. ఈ ప్రభుత్వమైనా గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు పూనుకుంటుందా? పాత సర్కార్‌ తోవలోనే పయనిస్తుందా? అనే చర్చ విద్యార్థుల్లో సాగుతోంది. నాసిరకం భోజనంతో విద్యార్థులు తరచూ అనారోగ్యం పాలవుతున్నారు. చలి వణికిస్తున్న తరుణంలోనూ చన్నీటి స్నానాలే చేయాల్సి వస్తోంది. అరకొర సౌకర్యాలతో విద్యార్థులు జబ్బుల బారిన పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ సరిగా లేకపోవడంతో పాటు పూర్తి స్థాయిలో సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఆహారం సరిగా లేక..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంది. సీజనల్‌ వ్యాధులతో విద్యార్థులు భయంభయంగా ఉంటున్నారు. నెలల తరబడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆహార నాణ్యతపై ప్రభావం పడుతోంది. ఫలితంగా సాయంత్రం స్నాక్స్‌, అరటిపండ్లు, గుడ్లు, చికెన్‌ అందించాల్సిన దానికంటే తక్కువగా అందిస్తున్నారు. గురుకులాల్లో విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామనే ఉత్తిమాటలు కట్టిపెట్టి, వారికి తగినవిధంగా మెనూను కేటాయించాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.
పేరుకుపోయిన బకాయిలు.. విడుదలలో నిర్లక్ష్యం
సంక్షేమ హాస్టళ్ల మౌలిక వసతులకోసం విడుదల చేయాల్సిన బడ్జెట్‌ను ప్రభుత్వం సకాలంలో రిలీజు చేయటం లేదు. దీంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ కోసం గడిచిన విద్యాసంవత్సరంలో సుమారు రూ. 5,480కోట్లు, ఒక్క గురుకులాలకే రూ.35కోట్లకు పైగా బకాయిలున్నాయని తెలుస్తున్నది. నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. అందుకనుగుణంగా మెనూ చార్జీలు పెరగటం లేదు. మరో పక్క అద్దె భవనాల్లో హాస్టళ్ల నిర్వాహణ కొసాగుతున్నది. సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిని పరిష్కరించాల్సింది సర్కారే.. కానీ కేటాయించిన బడ్జెట్‌ను విడుదల చేయటంలో నిర్లక్ష్యమే కొనసాగుతున్నది.

Spread the love