సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాం..

– త్రాగునీరు డ్రైనేజీతో కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు 
– దోమలు పెరగకుండా ఆయిల్ బౌల్స్, గంబుషియా చేప పిల్లల్ని  వదులుతాం
– స్థానిక సంస్థల అదనపు కలెక్టర్  టి.పూర్ణచంద్ర వెల్లడి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి వర్షాలు పడుతున్న సందర్భంగా మాన్ సూన్ యాక్షన్ ప్లాన్ పై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆయా జిల్లాల అధికారులతో సోమవారం  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై  జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. దోమలు పెరిగే ప్రాంతాల్లో ఫాగింగ్ చేయాలని, నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకొని నీరు కలుషితం కాకుండా విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. నల్గొండ జిల్లాకు సంబంధించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టామని, త్రాగునీరు డ్రైనేజీ నీరుతో కలవకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని,  వర్షపు నీరు నిలవ ఉండకుండా చర్యలు తీసుకుంటూనే  నీరు నిలువ ఉన్నచోట  దోమలు పెరగకుండా  నివారణ కోసం  ఆయిల్ బౌల్స్, గంబూషియ చేప పిల్లలని వదులుతామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.పూర్ణ చంద్ర తెలిపారు.  జిల్లాలో మిషన్ భగీరథ సర్వే కొనసాగుతున్నదని, స్కూల్ పిల్లలకు మొదటి విడత యూనిఫార్మ్స్  పంపిణీ చేయడానికి అన్ని చర్యలు పూర్తయ్యాయని, రెండవ విడత యూనిఫామ్  కి సంబంధించి ఇప్పటికే జిల్లాకు క్లాత్  వచ్చిందని, దానికి సంబంధించిన కుట్టు, పంపిణీ ని సైతం త్వరితగతిన పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు  తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  డిఆర్డిఎ పిడి నాగిరెడ్డి, జెడ్పి సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఆర్డబ్ల్యూఎస్  ఎస్ఈ  డి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love