మొదటి దశలో పాలమూరు నుంచి ఉద్దండపూర్ వరకు
26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం
30 నెలల్లో రూ.32 వేల కోట్లు ప్రాజెక్టుల అప్పులు కట్టాం
నోరు తెరిస్తే బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం సమాధానం చెప్పారు
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
పనుల పురోగతిపై ఉమ్మడి పాలమూరు జిల్లాలో
రెండోరోజు పర్యటన
తెలంగాణ నీటిపారుదల రంగం బీఆర్‌ఎస్ వల్లే నిర్వీర్యం: ఉత్తమ్
ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి
మల్లేష్ ఊరగొండ
రాబోయే రెండేండ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 26 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రాజెక్టుల్లో జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండలంలోని కరివేన గ్రామంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం పదేండ్ల కేసీఆర్ పాలనలో రూ. లక్షా 81 వేల కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. అందులో రూ. లక్ష కోట్లు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికే ఖర్చు చేశారని గుర్తు చేశారు. అత్యంత కీలకమైన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇతర ప్రాజెక్టులతోపాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సస్యశ్యామ లమవుతుందని పేర్కొన్నారు. మొదటి దశలో పాలమూరు నుంచి ఉద్దండపూర్ వరకు పూర్తి చేస్తామని తెలిపారు.
పదేండ్ల కాలంలో పాలమూరు ఎత్తిపోతలకు బీఆర్‌ఎస్ సర్కార్ ఖర్చు చేసిన వ్యయంలో పంపులు, లిఫ్టుల ద్వారా రూ.27 వేల కోట్ల కమీషన్లు కొల్లగొట్టారని విమర్శించారు. ‘పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వకుండా ఎక్కడికక్కడే వదిలేశారు. జిల్లాలో ఏ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ జరగలేదు. అలాంటప్పుడు ప్రాజెక్టులు పూర్తి అవుతాయని కేసీఆర్ ఎలా భావించారు. ఆయన ఆలోచన ఎంతసేపూ పంపులు, లిఫ్టులు, వేల కోట్లు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులు, కమీషన్లు కొట్టేయడమే. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన నేను ఈ ప్రాజెక్టులను ఒక కొలిక్కి తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే బీఆర్‌ఎస్ రాజకీయం చేస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చీదరించుకుంటారన్న సోయి కూడా లేకుండా బీఆర్‌ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్‌కు ఊడిగం చేయడం మానేయాలని హితవు పలికారు. కర్నాటక ప్రభుత్వం కృష్ణానది పొడవున బ్రిడ్జి కం బ్యారేజ్ ల పేరుతో 100 టీఎంసీల నీటిని నిల్వ చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే తరహాలో కర్నాటకతో కలిసి సంయుక్తంగా బ్రిడ్జ్ కం బ్యారేజ్‌ను నిర్మించేందుకు చర్చలు జరుపుతోందని గుర్తు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం పనులు మొదలుపెడతామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. గత ప్రభుత్వంలా తొందరపడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో, గత అనుభవం తెలిపిందని అన్నారు. తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని స్పష్టం చేశారు. గోదావరిలో 960 టీఎంసీల వాటాలు పూర్తిగా వినియోగించుకునేందుకు ప్రయత్ని స్తామన్నా రు. పాలమూరుకు సంబంధించి 90 టీఎంసీలు, డిండికి సంబంధించి 20 టీఎం సీల లెక్క తేలిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. కృష్ణా నీటికి సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందమే తెలంగాణ పాలిట మరణ శాసనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పారని తాను చెప్పేదేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
పదేండ్లలో బీఆర్‌ఎస్ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఉన్నదంతా దోచుకుపోయి మమ్మల్ని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్‌పై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 90 శాతం పనులు పూర్తయ్యాయని పచ్చి అబద్ధాలు చెబుతున్నారనీ, పాలమూరు ప్రాజెక్టుల అంచనాల్లో 50శాతం కూడా ఖర్చు చేయకుండా 90 శాతం పనులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. భూసేకరణకు రైతులందరూ సహకరించాలని కోరారు.
తెలంగాణ పట్ల కేంద్ర బీజేపీ సర్కారు వివక్ష
తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహాయ నిరాకరణ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. తెలంగాణ రైతుల పట్ల తమకు ప్రేమ ఉంది కాబట్టే రూ.16 వేల కోట్లు వెచ్చించి ధాన్యం కొంటున్నామని వివరించారు. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర బీజేపీ చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించిన మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఒప్పించాలని కోరారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం స్పందిం చకుండా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. మోడీ గద్దె దిగితే రాహుల్ ఆ స్థానంలో కూర్చొని దేశాన్ని ఎలా నడిపించాలో చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
30 నెలల్లో రూ.52 వేల కోట్ల అప్పులు చెల్లించాం.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు రూ.41,118 కోట్లు, వడ్డీ రూ.43,385 కోట్లు కలిపి మొత్తం రూ.84, 503 కోట్ల అప్పుల య్యాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అందులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 నెలల్లో అసలు రూ.33, 567 కోట్లు, వడ్డీ రూ.18,554 కోట్లు కలిపి మొత్తం రూ 52,120 కోట్లు అప్పులు చెల్లించామని తెలిపారు. 30 నెలల్లో కాంట్రాక్టర్లకు చెల్లించింది కేవలం రూ. 22 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. ఇందులో రూ.8 వేల కోట్లు పాలమూరు ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటికీ ప్రాజెక్టులకు సంబంధించి ఇంకా 4 వేల ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉందని తెలిపారు.
నీటి పారుదల రంగం
బీఆర్‌ఎస్ వల్లే నిర్వీర్యం : ఉత్తమ్
పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరందించలేదని విమర్శించారు. ప్రాజెక్టులను నిర్వీర్యం చేసింది చాలక ఏ మొఖం పెట్టుకుని పాదయాత్రలు చేస్తారని ఈ సందర్భంగా ఉత్తమ్ నిలదీశారు.



