వర్సిటీల్లో అన్నీ ఖాళీలే…

వర్సిటీల్లో అన్నీ ఖాళీలే...– తెలంగాణ వచ్చాక నియామకాల ఊసేలేదు
– బోధనా సిబ్బందిలో 70 శాతం పోస్టులు ఖాళీ
– అటకెక్కిన యూనివర్సిటీ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు
– రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో బిల్లు
– విశ్వవిద్యాలయాల్లో పాత పద్ధతిలోనే నియామకాలు!
+ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల్లో దాదాపు 70 శాతానికిపైగా ఖాళీగా ఉన్నాయి. 12 విశ్వవిద్యాలయాల పరిధిలో మొత్తం 2,825 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 873 (30 శాతం) మంది ప్రొఫెసర్లు మాత్రమే పనిచేస్తున్నారు. 1,977 (70 శాతం) ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో 1267 ప్రొఫెసర్‌ పోస్టులుంటే, వాటిలో 376 మాత్రమే పనిచేస్తున్నారు. ఏకంగా 891 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం.
ఇక కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)లో 409 ప్రొఫెసర్‌ పోస్టులుంటే, 86 మంది మాత్రమే ఉద్యోగంలో ఉన్నారు. దాదాపు 323 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పరిస్థితి ఆ రెండు విశ్వవిద్యాలయాలకే పరిమితం కాలేదు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013లో విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియ సాగింది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత వర్సిటీల్లో నియామకాల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టకపోవడం గమనార్హం. ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోగా, పరిశోధనలు నామమాత్రంగానే సాగుతున్నాయన్న విమర్శ ఉన్నది. ప్రొఫెసర్‌ పోస్టుల ఖాళీలతో నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గ్రేడ్‌లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తక్కువ గ్రేడ్‌ను కేటాయించడం వల్ల వర్సిటీల ప్రతిష్ట మసకబారుతున్నది. ఇంకోవైపు విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం సరిపోయినన్ని నిధులను కూడా గత పదేండ్లలో కేటాయించలేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందకపోగా, మెరుగైన వసతులను కల్పించడం లేదు. విశ్వవిద్యాలయాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.
కామన్‌ రిక్రూట్‌మెంట్‌
బోర్డు బిల్లుపై ఏం చేద్దాం?
రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల పరిధిలో 1,551 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. వాటిలో మొదటి విడతలో 1,061 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి ఇస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2017, నవంబర్‌ 25న ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పోస్టులను భర్తీ చేయలేదు. గతంలో విశ్వవిద్యాలయం యూనిట్‌గా ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేసి నియామకాల ప్రక్రియను చేపట్టే విధానం ఉండేది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ విధానాన్ని తొలగించి తెలంగాణ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లును రూపొందించింది. అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌ ఆమోదానికి పంపించింది. ఆ బిల్లు ద్వారా విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందన్న అభిప్రాయం ప్రొఫెసర్ల నుంచి వచ్చింది. దీంతో ఆ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్‌ పంపించారు. అయితే ఇప్పటి వరకు ఆ బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు, తిరస్కరించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో విశ్వవిద్యాలయం యూనిట్‌గా పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టేందుకు రేవంత్‌ సర్కార్‌ సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లును వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ అంశంపై న్యాయ నిపుణులతో సంప్రదించిన తర్వాత గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ కావాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఆ బిల్లును వెనక్కి తీసుకుంటే వర్సిటీల్లో ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించొచ్చని భావిస్తున్నది. ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తే మెరుగైన న్యాక్‌ గ్రేడ్‌ వచ్చే అవకాశమున్నది.

Spread the love