ఇంజినీరింగ్‌ మొదటి దశలో 70,665 సీట్ల కేటాయింపు

– ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌కు తగ్గిన ఆదరణ కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ కోర్సులకే మొగ్గు
– 31 కాలేజీల్లో 100 శాతం నిండిన సీట్లు
– ఈనెల 22 వరకు సెల్ఫ్‌ రిపోర్టు చేయాలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మొదటి దశలో సీట్లను కేటాయించారు. ఈ దశలోనే 85.48శాతం సీట్ల కేటాయింపు పూర్తయింది. 31 కాలేజీల్లో 100 శాతం పూర్తయ్యాయి. దీంతోపాటు కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ కోర్సులకే భారీగా డిమాండ్‌ పెరిగింది. ఈ కోర్సుల్లో 94శాతం సీట్లు నిండాయి. కేటాయించిన సీట్లకు సంబంధించిన విద్యార్థులు ఈనెల 22 వరకు ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టు చేయాలి. లేకపోతే ఆటోమెటిక్‌గా సీట్‌ క్యాన్సిల్‌ అవుతుందని ఎంసెట్‌ అధికారులు తెలిపారు.
70,665సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలు 16, ప్రయివేటు యూనివర్సిటీ కాలేజీలు రెండు, ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు 155తో కలిపి మొత్తం 173 కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ కోర్సులతోపాటు ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఇతర ఇంజినీరింగ్‌ కోర్సులు మొత్తం 82,666 సీట్లకు మొదటి దశలో 70,665 సీట్లను కేటాయించారు. ఇంకా 12001 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కనా యూనివర్సిటీల్లో 85.12శాతం, ప్రయివేటు యూనివర్సిటీల్లో 75.08 శాతం, ప్రయివేటు కాలేజీల్లో 85.71 శాతం సీట్లు నిండాయి. వీటిని రెండు, మూడో దశలో కేటాయించనున్నారు. అయితే మొదటి దశలోనే మూడు యూనివర్సిటీ కాలేజీలు, 28ప్రయివేటు ఇంజినీరింగ్‌ కాలేజీలతో కలిపి మొత్తం 31కాలేజీల్లో 100శాతం సీట్లు నిండాయని అధికారులు ప్రకటించారు.
కంప్యూటర్‌ సైన్స్‌ అనుబంధ కోర్సులవైపే
ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపులో అత్యధిక మంది విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ సంబంధిత కోర్సులకే మొగ్గుచూపారు. ఈ కోర్సుల్లో 55,876 సీట్లుంటే 52,637 సీట్లను అధికారులు కేటాయించారు. అత్యధికంగా 94.20 శాతం సీట్లు భర్తీ కాగా, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 78.70 శాతం, సివిల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 44.09 శాతం, ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 63.03 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ ఇంజినీరింగ్‌ అనుబంధ కోర్సులైన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ బిజినెస్‌ సిస్టం, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో కలిపి సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌(నెట్‌వర్క్స్‌), కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌( ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) కోర్సుల్లో 100శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మరో ఐదు కోర్సుల్లో 90శాతానికిపైగా, ఇంకొక ఐదు కోర్సుల్లో 80శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో 17,274 సీట్లకుగాను 13,595సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్‌స్ట్రూమెంటేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలిమ్యాటిక్స్‌ కోర్సుల్లో మాత్రం 100శాతం సీట్లు నిండిపోయాయి. సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సులకు సంబంధించి 8,261 సీట్లకుగాను 3,642 సీట్లు భర్తీ అయ్యాయి. వీటిలో మెటాల్లార్జికల్‌, మెకానికల్‌ విత్‌ ఎంటెక్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ సిస్టమ్స్‌, మెకానికల్‌ విత్‌ ఎంటెక్‌ థర్మల్‌, ఏరోనాటికల్‌, మెక్‌ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లోని 100శాతం సీట్లు నిండిపోయాయి. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సులకు సంబంధించి 1,255సీట్లకుగాను 791 సీట్లు భర్తీ అయ్యాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో 98.65 శాతం, జియో ఇన్ఫర్మెటిక్స్‌లో 95.38 శాతం, అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌లో 93.94 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇండిస్టీయల్‌ ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికే షన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ఒక్క సీటు కూడా భర్తీ కాలేదు.
22లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
ఎంసెట్‌ మొదటి దశలో ఇంజినీరింగ్‌ సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 22వ తేది లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. లేకపోతే ఆటోమెటిక్‌గా సీటు కాన్సిల్‌ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అలాట్‌మెంట్‌ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజును క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆ తర్వాత సీటు కన్ఫర్మేషన్‌ అవుతుంది. అయితే ట్యూషన్‌ ఫీజు చెల్లించే విద్యార్థులు.. వారి తల్లిదండ్రుల ఖాతా నుంచి చెల్లిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే.. రీఫండ్‌ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. ఈ నెల 22వ తేదీ లోపు ఫీజు చెల్లించి, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలి. తుది దశ కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత సంబంధిత కాలేజీల్లో విద్యార్థులు ఆగస్టు 9 నుంచి 11వ తేదీ మధ్యలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.

Spread the love