కళావ్యాసాల వర్ణలిపి

Alphabet of works of artభారతీయ సంస్కృతిలో 64 కళలున్నాయి అంటారు. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, నృత్యం, కవిత్వం అనే ఐదు కళలను లలిత కళలు అంటారు. ఇవి మానవునకు పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని కలుగజేస్తాయి. ఫైన్‌ ఆర్ట్స్‌ పేరిట విశ్వవిద్యాలయాల్లో కోర్సులు అందిస్తున్నారు. జంతువులు, మానవులతో కూడిన చిత్రాలు భారతీయ తొలి కళగా చెప్పవచ్చు. తొలిచిత్రాలు ఏడు వేల సంవత్సరాల కిందటివి అని చెప్పబడుతున్నాయి. సింధులోయ నాగరికతలో బంగారు, టెర్రకోట, రాతిబొమ్మలు నృత్య భంగిమల్లో కనిపిస్తాయి. అత్యంత ప్రసిద్ధి చెందిన మొహంజదారో కాంస్య విగ్రహం అసాధారణ పనితనాన్ని చూపిస్తుంది. రచయిత్రి ఈ పుస్తకం తన మాతృమూర్తి కీ.శే.అంగలకుదిటి గోవిందమ్మ కు అంకితం చేశారు. ఒకనాడు గ్రామాల్లో ప్రతి ఇల్లు కుట్లు, అల్లికలతో అలలారుతూ వుండేది. వైరు బుట్టలు అల్లడం ప్రధాన కళగా వుండేది. అలాగే పెయింటింగులు వేసేవారు. హాండ్‌క్రాఫ్ట్స్‌ ద్వారా బొమ్మలు చేయడం వంటి ఎన్నో కళలు వీరి ఉత్తమాభిరుచికి నిదర్శనాలు. రవీంద్రుని శాంతినికేతన్‌, హస్తకళా మ్యూజియాలు, మైసూర్‌ రవివర్మ ఆర్ట్‌ గ్యాలరీ సందర్శించిన రచయిత్రి బాల్యం నుండే కళపై స్ఫూర్తినొంది, క్రాఫ్ట్స్‌ ఎంపోరియాలు చూసి కళారూపాలు సృష్టించడం నేర్చుకుని తయారు చేయడం… ఆయా కళారూపాల సృష్టి గురించి పత్రికల్లో వ్యాసాల ద్వారా తెలియజేయడం రాణీప్రసాద్‌ ప్రత్యేకత, అభిరుచి. భారతీయ చిత్ర కళారూపాల గురించి దాదాపు 22 ప్రక్రియలతో కూడిన చేతి(తో) కళాకృతులు చేయడం గురించి సవివరంగా, సచిత్రంగా ఈ పుస్తకంలో రాశారు. ఈ వ్యాసాలు నవతెలంగాణ డైలీలో ప్రచురించబడి పాఠకాదరణ పొందాయి.
క్విల్లింగ్‌ కళాచిత్రాలు, రాజస్థానీ అద్దాల చిత్రకళ, సీషెల్స్‌ సింగారాలు, కేరళ మ్యూరల్‌ చిత్రాలు, కాగితపు గుజ్జు కళారాజాలు, బీహార్‌ మధుబని చిత్రకళ, వల్లి గిరిజన చిత్రకళ, రంగుకాగితాల కత్తిరింపులు, కొబ్బరాకుల కళాకృతులు, పూసల అల్లకాల డిజైన్లు, గుజరాత్‌ లిప్పన్‌ ఆర్ట్‌, హాని చెయ్యని కొయ్యబొమ్మల తయారీ, బంకమట్టి బొమ్మలు, కాపర్‌వైర్‌తో కళాకృతులు, భగల్పూరు మంజూష కళ, ఆప్లిక్‌ వర్క్‌… ఇలా ఎన్నో కళాకృతులు ఎలా తయారు చేయాలో చెప్పారు. నేర్పించారు. దాదాపు 100 కు పైగా ఎగ్జిబిషన్ల పెట్టారు రచయిత్రి. బాలసాహిత్యం లోనూ కృషి చేశారు. సైన్స్‌లో బుక్స్‌ రాశారు. బాల బాలికలు, గృహిణులు, పెద్దలు ఇంటివద్దే తక్కువ ఖర్చుతో అద్భుత కళాకృతులు ఎలా తయారు చేయవచ్చో నేర్పించే గొప్ప గైడ్‌ లాంటి ఈ పుస్తకం ప్రతి ఇంటా ఉండాల్సిన మంచి పుస్తకం.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

వర్ణలిపి
రచన : డా||కందేపీ రాణీప్రసాద్‌
పేజీలు : 98, వెల : 125/-
ప్రతులకు : డా||కందేపీ రాణీప్రసాద్‌,
మేనేజింగ్‌ డైరెక్టర్‌, సృజన చిల్డ్రన్స్‌ హాస్పటల్‌, సిరిసిల్ల – 505301.
తెలంగాణ. ఫోన్‌ : 9866160378.

Spread the love