స్వాతంత్య్ర భారతదేశం అంబేడ్కర్ 134వ జయంతి జరుపుకోవటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఒక పక్కపార్లమెంట్ సాక్షిగా జరిగిన ఘోర అవమానం.మరోపక్క ఆయన ఎన్నడూ లేనంత ఎత్తుకు ఎదిగినట్లు కనిపి స్తున్నది.అనేకముఖ్య ఘట్టాల్లో, ఉద్యమాల్లో నవభారత నిర్మాణం, ప్రజాస్వామ్యం, సామాజిక రుగ్మతలు లేని దేశం కోసం అంబేడ్కర్ కృషి చేశారు. ఆయన జీవితానుభవంలో గుర్తించిన సామాజిక సమస్యలు, ఉద్యమాలు, అధ్యయనం, ఆలోచనలను ప్రయోగాత్మకంగా పరిశీలించాలి. భారత సమాజం గురించి ఆయన లోతుగా పరిశీలన చేసి లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగా నిలిచి ఉండటం,ఆయన కృషిని,ప్రాధాన్యతని నేటికీ గుర్తు చేస్తున్నాయి.1871 ఏప్రిల్ 14వ తేదీన మధ్య భారతదేశంలో మౌ అనే ప్రాంతంలో, మత భావాలను విశ్వసించే,పేద మెహర్ కుటుంబంలో భీమ్ రావ్ అంబేడ్కర్ జన్మించారు.పాఠశాల విద్యాభ్యాసం సతారాలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబైలోను పూర్తిచేసిన అంబేడ్కర్ 1913-17లో కొద్దికాలం పాటు బరోడా మహారాజు దగ్గర సేవలందించారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కొలంబియా విశ్వవిద్యాలయంలో, గ్రేస్ ఇన్ బాక్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య నభ్యసించిన ఈ నవయువకుడు ఆనాటి సమకాలీన రాజకీయ నాయకుల్లో చాలా మందికి లేనటువంటి, అమోఘమైన పాండిత్యాన్ని సంపాదించారు. సామాజిక అడ్డంకులు ముఖ్యంగా పక్షపాత వైఖరి, సామాజిక అణచివేతలు, కులపీడనలు వంటివి ఎదుర్కొని ఈ ఘనత సాధించారు.
1920లలో తొలినాళ్లకే అంబేడ్కర్ ఎంఎ, పిహెచ్‌డి అర్థశాస్త్రంలో ఎమ్మెస్సీ,డి.ఎస్.సి, బారిస్టర్ ఎట్ లా పూర్తి చేశారు.తనకి ముప్తై ఏండ్లొచ్చేసరికే ప్రముఖ విద్యావేత్తలు, అధ్యయనకారులు తమ జీవితకాలంలో సాధించలేనన్ని నిజ జీవితఅనుభవాలను అంబేడ్కర్ గడించారు. నాలుగు దశాబ్దాల తన ప్రజాజీవితంలో అనేక వివాదాస్పద అంశాలలోనూ, అధిగమించటానికి వీలు లేనటువంటి సామాజిక అంధకారంలో నుంచి వెలుతురులా ఉద్భవించారు. అలెగ్జాండర్ గోల్డెన్‌పైసర్ 1916మే నెలలో సామాజిక శాస్త్రాలపై సెమినార్ జరిపినప్పుడు, మొట్టమొదటి సారిగా అంబేడ్కర్ భారతదేశంలో కులాల తీరు తెన్నులు, పుట్టుక, అభివృద్ధి అనే అంశంపై చాలా అద్భుతమైన పత్రాన్ని అందించారు. పారదర్శకత, నిజాయితీ, పట్టుదల వంటి అపూర్వగుణాలు కలిగిన ఉదారవాది డా.అంబేడ్కర్. తాత్వికంగా మొదట ఆదర్శవాదం వైపు మొగ్గినప్పటికీ, అంతిమంగా బుద్ధుని సిద్ధాంతం వైపు ఆకర్షితుడయ్యారు. మార్క్సిజం పుస్తకాలను కూడా చాలా లోతుగా అధ్యయనం చేశారు. 1950లో ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి హిందూ కోడ్ బిల్లు తెచ్చినప్పుడు, అదే జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా అంబేడ్కర్‌ను దెబ్బతీశారు. అంబేడ్కర్ జీవించినంత కాలం, ఆయన ప్రత్యర్ధులు, విమర్శకులు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు, ఆయన్ను ఆ యుగంలోని వ్యూహాత్మక లక్ష్యాన్ని గుర్తించలేని వ్యక్తిగా పదేపదే అభివర్ణించేవారు.ఆ ప్రచారం బాగా ప్రాచుర్యం పొంది, ఆఖరికి మీడియా కూడా ఆయన్ను ఒక రెండో తరగతి దేశనాయకుడిగా,షెడ్యూల్డ్ కులాలకే పరిమితమైన నాయకుడిగా చిత్రీకరించింది. వస్తుగతంగా చూస్తే ఆయనంత ఉన్నత వ్యక్తి, సాహసోపేతమైన దేశ నాయకులు చాలా తక్కువమంది ఉన్నారన్నది సుస్పష్టం.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో నడిచిన స్వాతంత్య్ర పోరాటంలో దీనికి తగినంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. దేశ రాజకీయ దృక్పథంలో ఎప్పుడూ నికరంగా కేంద్ర స్థానం వహిస్తూ, తీవ్రవాద శైలితో, సామాజిక అంశాల్లో ఎటువంటి సర్దుబాటు ధోరణి ప్రదర్శించకుండా ఎన్నో ఉద్య మాలకు నాయకత్వం వహించారు అంబేడ్కర్. సమాజంలోని అసమానతలు, మతాల్లో ఇమిడి ఉన్న అణచివేత ధోరణులు, సాంప్రదాయ వారసత్వాలు, మెజారిటీ సమాజం రుద్దిన విలువలను గమనించారు. అంబేడ్కర్ రాజ్యాంగసభలో,రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షత వహించి,ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో కొంతకాలం ఉన్నప్పటికీ, భారత రాజకీయాల్లో కాంగ్రెసేతర, కాంగ్రెస్ వ్యతిరేక భావధారకు ఆయన్నే మనం ఆద్యుడిగా పరిగణించాలి.కానీ వాటికి భిన్నంగా హిందూ మితవాదం బాగా పైచేయి సాధించి,మెజారిటీ మతమౌఢ్యం, సామాజిక అభివృద్ధి నిరోధకత్వాలు సాగిస్తున్న రాజకీయ,సిద్ధాంత ఎదురుదాడి ప్రస్తుత దేశపరిస్థితికి అద్దం పడుతున్నాయి. అంబేడ్కర్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి హిందూత్వవాదులు చరిత్రసారాన్ని వక్రీకరించి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో కులవ్యవస్థపైనా,చాతుర్వర్ణ, సనాతన ధర్మాల పైనా ప్రతిఒక్కరూ పోరాడాలి. అంటరానితనాన్ని మార్పు లేకుండా యధాతథంగా నిలిపి ఉంచే సామాజిక దొంతరలపైనా హిందూ ధర్మశాస్త్రాల ఆధిపత్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలపై నేడు ఉద్యమించాలి. ప్లాటో రిపబ్లిక్ ఏ కారణం వల్ల వైఫల్యాన్ని ఎదుర్కొందో,సరిగ్గా అదే కారణం మూలంగానే చాతుర్వర్ణ వ్యవస్థ కూడా తప్పని సామాజిక తిరుగుబాటుదారుడైన,ఈ పీడిత వర్గ మేధావి హెచ్చరించారు.
ఈ దుర్మార్గ వ్యవస్థ మూలంగా హిందువుల్లో దిగువ వర్గాలు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగకుండా పూర్తిగా నిస్సహాయులుగా చేయబడ్డారని అంబేద్కర్ వేలెత్తి చూపి ఇంతకంటే నీచమైన సామాజిక వ్యవస్థ మరొకటి రాబోదని హెచ్చరించారు.ఈ వ్యవస్థ ప్రజలను పరస్పర సహాయ కార్యకలాపాలు చేయనివ్వకుండా కుంటుపరిచి,వారిని నిస్సహా యులుగా,చచ్చుబడిన వారిలా చేస్తుందని తెలిపారు.ఆయన సామాజిక, ఆర్థిక,ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తూనే ఈ వ్యవస్థ రాజకీయ రంగంలో కలగజేసే ప్రభావాలపై దృష్టి సారించి అవిరళమైన కృషి చేశారు. ధర్మశాస్త్రాలపై ఉన్న విశ్వాసాన్ని సర్వనాశనం చేయడం,వాటి పునాదిగా గల కులపరమైన నిరంకుశత్వాన్ని నాశనం చేయడమే దీనికి వాస్తవ పరిష్కారమని అంబేడ్కర్ భావించారు.ఇటువంటి విషయాల్లో గాంధీ అర్ధ శతాబ్దానికి ముందే ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ హిందూ మతానికి ఓసవాల్’ అని ప్రకటించాడంటే అందులో ఆశ్చర్యమేమీలేదు. నిజంగానే ఆయన ఈనాటికీ ఒక సవాల్ గానే నిలిచి ఉన్నారు.అందువల్లనే హిందూత్వ వాదులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు కూటమికి చెందిన కొన్ని శక్తులు నేడు ఆయనను నిర్లక్ష్యం చేయలేని స్థితిలో ఉన్నాయి. సామాజిక పురోగతిని నిరోధించటానికి పూనుకున్న వారిని వ్యతిరేకిస్తూ, సామాజిక ఛాందసవాదం, అవకాశవాద రాజకీయాలపై యుద్ధాలు సాగిస్తూ 1940 దశకం చివరిలో, 1950 దశకం తొలిలో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలకు నాయకత్వం వహించారు.కానీ ఛాందసవాద శక్తులు ఆయన ప్రయత్నానికి వెన్నుపోటు పొడిచాయి.
వారసత్వం, వంశపారంపర్య పాలననూ,ఏక పార్టీ వ్యవస్థను ఆయన ద్వేషించారు.ఒకే పార్టీ ప్రజామోదమైన ప్రభుత్వాన్ని నడపటం అంటే,నిరంకుశత్వం తెరవెనుక నుండి పాలన సాగించే ఒక రూపంగా ప్రజాస్వామ్యం తయారవ్వడాన్ని అనుమతించడమే అనేది అంబేడ్కర్ ప్రముఖ సూత్రీకరణల్లో ఒకటి.నిరంకుశత్వం ఎన్నికయినదయినప్పటికీ, అది నిరంకుశత్వం కాకమానదు. నిరంకుశత్వం కూలదోయబడే అవకాశం ఉండటం,దాన్ని తోక ముడిచేటట్లు చేయగల అవకాశం ఉండటం,దాని ప్రత్యర్ధి పార్టీ దాని స్థానంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటమే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిజమైన గ్యారంటీ అని అంబేద్కర్ హెచ్చరించారు. ఏకపార్టీ పాలన ప్రాతిపదికన గానీ,లేదా నిద్రపోయే హక్కులని నిద్రపోనీ అనే సామాజికతత్వ ప్రాతిపదికతో ఉండే రాజకీయ సుస్థిరత గానీ అంబేడ్కర్‌కు గిట్టని విషయాలు. అంబేడ్కర్ దూరదృష్టితో వెలిబుచ్చిన రాజకీయ భావాల్లో రెండు నేటి కాలానికి కూడా వర్తిస్తాయి.వాటిలో మొదటిది రాజకీయ స్వేచ్ఛలను ఒక గొప్ప వ్యక్తి పాదాల కింద ఉండనివ్వకండని,రెండోది రాజకీయాలలో భక్తి లేదా వీరాధన ఉంటే అది అధోపతనానికి దారి అని చెప్పారు.అందుకే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్ది,వైరుధ్యాలను పరిష్కరించాలని లేకపోతే అవి ప్రజాస్వామ్య పునాదుల్ని నాశనం చేస్తాయని అంబేడ్కర్ ఆనాడే హెచ్చరించారు.కాబట్టి నేడు ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సంక్షోభాలను అధిగమించేందుకు పోరాడటమే ఆయనకు నేడు మనమిచ్చే నిజమైన నివాళి.
(ఏప్రిల్ 14 డాక్టర్ అంబేద్కర్ జయంతి)
నాదెండ్ల శ్రీనివాస్
9676407140