అమెరికా నిస్సిగ్గు సమర్ధన!

– ఇజ్రాయిల్‌ మారణకాండపై అంతర్జాతీయంగా ఖండనలు
వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ చర్యలను ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో ఖండిస్తున్నా అమెరికా మాత్రం నిస్సిగ్గుగా సమర్ధిస్తూనే వస్తోంది. తాజాగా రఫాలో జరిపిన దాడిలో 45మంది అమాయకులు మరణించడంపై అంతర్జాతీయంగా ఖండనలు, విమర్శలు వస్తున్నా అమెరికా మాత్రం ఒక అడుగు ముందుకేసి ఇజ్రాయిల్‌ ఇంకా తాము విధించిన లక్ష్మణ రేఖను దాటలేదంటూ చెబుతోంది. పైగా ఆయుధాల సరఫరా ఆపేది లేదని తెగేసి చెప్పింది. అమెరికా జాతీయ భద్రతా ప్రతినిధి జాన్‌ కిర్జీ విలేకర్లతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ చర్యల ఫలితంగా తాము ఆ దేశం పట్ల అనుసరిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అవసరమైతే భవిష్యత్తులో ఆయుధాల బదిలీని ఆపుచేసేందుకు అధ్యక్షుడు జో బైడెన్‌ విధించిన ‘రెడ్‌ లైన్‌’ను ఇజ్రాయిల్‌ ఇంకా దాటలేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కూడా దాటదని అనిపిస్తోందని అన్నారు. ఎంతమంది పౌరులు చనిపోతే ఇజ్రాయిల్‌ను శిక్షించాలనేది నిర్ణయించడానికి కొలమానం అంటూ లేదని చెప్పారు. ”రఫాలో జనాభా కేంద్రీకృతమైన ప్రాంతాల్లో ఇజ్రాయిల్‌ ఇంకా పెద్ద ఎత్తున ఎలాంటి సైనిక చర్యలు చేపట్టడం లేదు. పైగా ఆ దిశగా వారు కదలడం కూడా లేదు.” అని కిర్బీ వ్యాఖ్యానించారు. అమాయకుల ప్రాణాలను కాపాడేందుకు ఇజ్రాయిల్‌ సాధ్యమైన ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని చెప్పారు. ఆదివారం జరిగిన దాడిని వైట్‌హౌస్‌ నామమాత్రపు రీతిలో ఖండించింది. పైగా ఈ దాడిపై ఇజ్రాయిల్‌ దర్యాప్తు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని కిర్బీ చెప్పారు. ఈ దాడిలో అమెరికా అందచేసిన ఆయుధాలే వాడారా లేదా అన్న విషయం కూడా తమకు తెలియదని పెంటగన్‌ డిప్యూటీ పత్రికా కార్యదర్శి సబ్రినా సింగ్‌ తెలిపారు.

Spread the love