అమృత్‌ ఉద్యాన్‌ ఓపెన్‌ సందర్శకులకు రేపటి నుంచి అనుమతి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రాష్ట్రపతి భవన్‌లో ‘అమృత్‌ ఉద్యాన్‌ (మొఘల్‌ గార్డెన్‌)’ను ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు (శుక్రవారం) ప్రారంభించనున్నారు ఈ నెల 16 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజలు దీన్ని సందర్శించేందుకు అనుమతించనున్నారు. అన్ని సోమవారాల్లో సెలవు ఉంటుంది. సందర్శకులకు తమ ఇండ్ల ఆవరణలో నాటుకోవడానికి వీలుగా తులసి మొక్కల విత్తనాలతో కూడిన ‘సీడ్‌ పేపర్ల’ను (విత్తన పత్రాలు) పర్యావరణహిత జ్ఞాపికగా ఇవ్వనున్నట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఉద్యాన వనంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా రాళ్లతో రూపొందించిన అబాకస్‌, ధ్వని వెలువడే గొట్టాలు, సంగీత కుడ్యాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్‌ ఆవరణలో 15 ఎకరాల్లో విస్తరించిన అమృత్‌ ఉద్యాన్‌ను ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. దీని కోసం రాష్ట్రపతి భవన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 35వ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకు న్నాక కియోస్కుల ద్వారా కూడా ఈ పని చేసుకోవచ్చు. సమీప మెట్రోస్టేషన్‌ నుంచి అక్కడికి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.

Spread the love