- పీఎం మోడీకి కేసీ వేణు గోపాల్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్‌పర్సన్ కేసీ వేణు గోపాల్ పీఎం మోడీకి లేఖ రాశారు. రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు . ఈ మేరకు గురువారం ఎక్స్ వేదికగా పొస్టు చేశారు. అయోధ్య చందా చోరీ కేసు దేశాన్ని కుదిపేసిందని, కోట్ల మంది రామభక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన లేఖలో పేర్కొన్నారు.
శ్రీరాముడి పేరుతో సేకరించిన విరాళాల దుర్వినియోగం కేవలం ఆర్థిక కుంభకోణం మాత్రమే కాదని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకంపై దాడి అని అన్నారు. కోట్లాది మంది అమాయక భక్తులు తమ కష్టార్జితాన్ని శ్రీరాముడి పేరు మీద ఇచ్చారు. ‘మర్యాద పురుషోత్తముడు’గా పేరుగాంచిన ఆయనను, హిందూ విశ్వాస పరిరక్షకులమని చెప్పుకునే వారు దుర్వినియోగం చేసి, ఆయన ప్రతిష్టను దెబ్బతీశారని వేణుగోపాల్ అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పబ్లిక్ ట్రస్ట్ ద్వారా రామ మందిరాన్ని నిర్మించారని, ఆలయ పరిపాలన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన పేర్కొన్నారు. విరాళాల దోపిడీ వెనుక అవినీతికరమైన ఒక నెట్‌వర్క్ ఉందని ప్రాథమిక విచారణలు సూచిస్తున్నాయని వేణుగోపాల్ ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ సరిపోవడం లేదని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత విచారణ జరపాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, ఫైజాబాద్ బార్ అసోసియేషన్ గురువారం నాడు, ఆరోపిత ఆర్థిక అవకతవకలకు సంబంధించి శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా, నిర్వాహకుడు గోపాల్ రావు తదితరుల పేర్లను పేర్కొంటూ అయోధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటి) విచారణ పరిధిని విస్తృతం చేసేందుకు దాని పదవీకాలాన్ని 15 రోజులు పొడిగించింది. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.



