నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని బృందావన్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం సుమారు 9.40 గంటల సమయంలో రైల్వే ట్రాక్ నంబర్ 513/9-10 వద్ద 40 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓ వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతుడి ఎత్తు సుమారు 5 అడుగుల 2 అంగుళాలు. చామనచాయ రంగు, గుండ్రటి ముఖం, నల్లటి వెంట్రుకలు ఉన్నాయి. కుడిచేతిపై “జే నర్సింలు” అని పచ్చబొట్టు ఉండగా, కుడిచేతికి వెండి కడియం, మెడలో నల్లని దారంతో రాగి తాయెత్తు ధరించి ఉన్నాడు. తెలుపు రంగులో గోధుమ రంగు పూల డిజైన్ ఉన్న షర్టు, బూడిద (గ్రే) రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కామారెడ్డి రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై సాధు లింబాద్రి 87126 58614 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.



