నెరవేరని సాగునీటి కల

– ఉమామహేశ్వర లిప్టు భూమి పూజకు 9 నెలలు
– నాడు హడావుడిగా లిప్టుకు జీఓ విడుదల
– కంప మద్యలో లిప్టు పైలాన్‌
– అందోళనలో అన్నదాతలు
ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వెనకబడిన నల్లమల చెంచుల సాగు భూములను తడపడానికి తలపెట్టిన ఉమా మహేశ్వర లిప్టుపనులు ఆగిపోయాయి. ఎన్నికలకు ముందు హడావుడిగా జీఓ తెచ్చి భూమి పూజ చేయడానికి అచ్చంపేట పట్టణంలో పైలాన్‌ ఏర్పాటు చేసి భూమి పూజకు ఏర్పాట్లు చేశారు. అదే రోజు మద్యహ్నం అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో పైలాన్‌ ఆవిష్కరణ ఆగిపోయింది.ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. రెండు నెలల్లో ఉమామహేశ్వర, చెన్నకేషవ లిప్టుల పనులు మొదలు పెడతారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే…నల్లమల చెంచు పెంటలకు సాగునీటితో పాటు తాగునీటి సమస్య తీరుతుందని చెంచులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ -మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా నల్లమలలోనే చెంచులు జీవిస్తున్నారు. పదర, బల్మూరు, అచ్చంపేట, లింగాల, ఉప్పునుంతల,నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం తెలకపల్లి మండల పరిధిలో 53 గ్రామాల పరిధిలో 57200 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయరు నుంచి 25 కిలోమీటర్లు కాల్వ ద్వారా నీటిని తరలిస్తారు. లింగాల మండలం సూరారం గ్రామ సమీపాన లిప్టు ఏర్పాటు చేసి 70 మీటర్లు ఎత్తిపోసి బల్మూరు దగ్గర కొత్తగా ఏర్పాటు చేయనున్న రిజర్వాయరు నింపాల్సింది. ఈరిజర్వాయరు ద్వారా లింగాల, అచ్చంపేట, బల్మూరు మండలాల పరిధిలోని గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ఫేజ్‌ -1 నిర్మాణ పనులకుగాను రూ.1534.50 కోట్లను కేటా యించారు. మొదటి ఫేజ్‌లో అచ్చంపేట మండల మరిధిలో 15 గ్రామాలకు 23220 ఎకరాలు, ఉప్పునుంతల మండల పరిధిలో 4 గ్రామాలకు 1552 ఎకరాలు, బల్మూరు మండల 20 గ్రామాలకు 23072 ఎకరాలకు సాగునీరు అందుతోంది. లింగాల మండల పరిధిలో 8 గ్రామాలకు 4456 ఎకరాలకు, తెలకపల్లి మండల పరిధిలోని 5 గ్రామాలకు 4790 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో ఫేజ్‌లో అమ్రబాద్‌ మండలంలో 5 గ్రామాలకు 9560 ఎకరాలు,పదర మండలంలో 4940 ఎకరాలకు సాగు తాగునీరు అందుతోంది.ఈపనులకుగాను రూ. 649.10 కోట్లను కేటాయించింది. ఈ పనులు పూర్తి చేయాలంటే రైతుల నుండి ఎటువంటి అభ్యంతరం ఉండరాదు. ముఖ్యంగా మొదటి ఫేజ్‌ కింద 4142 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. రెండో ఫేజ్‌ కింద పనులు పూర్తి చేయడానికి 1612 ఎకరాల సాగు భూములను రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.ఈ ప్రాంత రైతులు కాల్వల నిర్మాణ పనులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఉన్న ఎకరం అర ఎకరం భూమి కోల్పోతే మేము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వాలు మారడంతో ప్రాజెక్టులు డిలా
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. గత పాలకులు పదేళ్ల కాలంలో ఈ జిల్లా తాగునీటి ప్రాజెక్టులపై చిత్త శుద్ది చూపలేదు. గట్టు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు సైతం నిర్లక్షానికి గురౌతున్నాయి. వైఎస్‌ఆర్‌ మొదలు పెట్టిన బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిర్వహణ కోసం నిధులు కెటాయించడం లేదు. పాలమూరు వర ప్రధాయని అని ప్రచారం చేసుకున్న పాలమూరు రంగారెడ్డి పనులు సైతం కూనరిల్లుతున్నాయి. తెలంగాణలో అధికార మార్పిడి జరగడంతో ప్రాజెక్టులు పూర్తి చేస్తారన్న ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రాజెక్టులు లేనిదే సాగు చేయలేం.
మేము నల్లమలలో 50 ఏళ్లుగా వర్షాదారం మీద ఆదార పడి పంటలను సాగు చేస్తున్నాం. అతివృష్టి అనా వృష్టితో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అందుకే ప్రాజెక్టు నీళ్లు వస్తే…సాగుకు బరోసా కల్గుతోంది. ఇప్పటికైనా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
– బ్రహ్మాచారి, మున్ననూరు. నాగర్‌కర్నూల్‌

ఒక పంటకు నీరు వస్తే… చాలు
మేము భూతల్లిని నమ్ముకొని సాగు చేసుకుంటున్నాం. తిండి గింజలు తప్ప ఇతర పంటలు ఏవీ సాగు చేయడం లేదు. ముఖ్యంగా వాణిజ్య పంటలయిన పత్తి , వేరుశనగ వేయాలంటే నీటి వసతి కావాలి. సాగునీటి వసతి కల్పిస్తే…మాకు ఆర్థికంగా ఎదుగుతాం.
– లింగం, లక్ష్మిపల్లి బల్మూరు మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

ఉమామహేశ్వర లిప్టు పనులు మొదలు పెట్టాలి
ఈ ప్రాంత చెంచులకు ఉపయోగ పడే ఉమామహేశ్వర లిప్టు మొదటి రెండో ఫేజ్‌లను వెంటనే మొదలు పెట్టాలి. గత ప్రభుత్వం చివరి హడావుడి చేసి పథకం పైలాన్‌ను అవిష్కరించి చేతులు దులుపుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అయినా…పనులను మొదలు పెట్టి ఈ ప్రాంత సాగునీటి సమస్యను తీర్చాలని కోరుతున్నాను.
వర్ధం పర్వతాలు,
– సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్‌

Spread the love