– కేరళ ప్రభుత్వ నిర్ణయం…
– డిసెంబర్ నుంచి అమలులోకి
తిరువనంతపురం: కేరళలోని అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆశావర్కర్ల గౌరవ వేతనాలను డిసెంబర్ నుంచి పెంచాలని వామపక్ష ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 89 వేల మంది లబ్ధిపొందనున్నారు. కేరళ ఆర్థిక శాఖ మంత్రి కెఎన్ బాలగోపాల్ మీడియాతో మాట్లాడుతూ పదేళ్లకుపైగా సర్వీసు ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు వెయ్యి రూపాయల చొప్పున వేతనం పెరుగుతుంది. పదేళ్లలోపు అనుభవం ఉన్న వారికి రూ.500 పెరుగుతుంది. ఈ నిర్ణయంతో 62,852 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి బాలగోపాల్ తెలిపారు. ఆశావర్కర్ల గౌరవ వేతనం రూ.వెయ్యి చొప్పున పెరుగుతుంది. ఈ నిర్ణయంతో 26,125 మంది లబ్ధిపొందనున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులు, ఆశావర్కర్లకు గౌరవ వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కేరళలోని వామపక్ష ప్రభుత్వం డిసెంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.