ఎయిర్‌పోర్ట్‌ మెట్రో నిర్మాణంలో మరో కీలక అడుగు

గ్లోబల్‌ టెండర్లకు ఆహ్వానం.. నేటి నుంచి బిడ్డింగ్‌ పత్రాల జారీ
– ప్రాజెక్టుకు రూ.5,688 కోట్లు.. బిడ్డింగ్‌కు చివరి తేదీ జులై 5
– హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌
ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి
నవతెలంగాణ- సిటీబ్యూరో
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. 31 కి.మీ మీటర్ల పొడవైన ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు ఈపీసీ కాంట్రాక్టర్‌ ఎంపిక కోసం(ఇంజినీరింగ్‌, సేకరణ, నిర్మాణం) గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించినట్టు హెచ్‌ఏఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బిడ్డింగ్‌ పత్రాలను నేటి నుంచి జారీ చేయనున్నామని, చివరి తేదీ జులై 5గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ కాంట్రాక్టు విలువ రూ.5,688 కోట్లుగా నిర్ధారించారు. టెండర్‌ విలువ ప్రాజెక్టు వ్యయం కంటే తక్కువగా ఉండటంపై ఆయన స్పష్టతనిచ్చారు. ఈ ప్రాజెక్టు విలువ మొత్తం రూ.6,250 కోట్లు కాగా.. ఇందులో రూ.5,688 కోట్లు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం వినియోగించగా.. మిగిలిన రూ.562 కోట్లు భూగర్భ సామర్థ్య పరీక్షలు, పెగ్‌ మార్కింగ్‌ తదితర పనుల కోసం ఖర్చు చేయనున్నట్టు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.
ఎంపికైన కాంట్రాక్టర్‌ మెట్రో రైలు వ్యవస్థకు అవసరమైన ఎలివేటెడ్‌ వయాడక్ట్‌, భూగర్భ పనులు, స్టేషన్లు, ట్రాక్‌ పనులు, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ పనులు, సరఫరా, రోలింగ్‌ స్టాక్‌(రైలు బోగీలు), ఎలక్ట్రిక్‌ ట్రాక్షన్‌, విద్యుత్‌ సరఫరా, సిగలింగ్‌, టెలీకమ్యూనికేషన్స్‌, రైలు నియంత్రణ వ్యవస్థలు, ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) గేట్లు మొదలైనవి పూర్తిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ముమ్మరంగా కొనసాగుతున్న పనులు
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, పెగ్‌ మార్కింగ్‌, అలైన్‌మెంట్‌ ఫిక్సేషన్‌ వంటి ప్రాథమిక పనులన్నీ పూర్తయ్యాయని, భూసామర్థ్య పరీక్షల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నట్టు ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కోసం చేపట్టిన కొత్త సర్వే ప్రకారం రాయదుర్గం మెట్రో స్టేషన్‌-ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ స్టేషన్‌ల నడుమ మొత్తం దూరం 31 కి.మీలు కాగా.. ఇందులో ఆకాశమార్గం(పిల్లర్లపై ఎలివేటెడ్‌) 29.3 కి.మీ ఉండగా, అండర్‌ గ్రౌండ్‌లో 1.7కి.మీ పొడవున పనులు జరుగుతాయని చెప్పారు. కాగా, విమానాశ్రయ టెర్మినల్‌కు ఆనుకొని ఒక భూగర్భ మెట్రో స్టేషన్‌తో కలిపి మొత్తం 9 స్టేషన్లు ఉంటాయని, విమానాశ్రయ మెట్రో కారిడార్‌కు సమీపంలో వాణిజ్య, బహుళంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున జరుగుతుందని వివరించారు.
మరో నాలుగు అదనపు స్టేషన్లు..
అన్ని తరగతుల వారు ఎయిర్‌పోర్ట్‌ మెట్రో లైన్‌ ద్వారా నగరంలో వారివారి కార్యాలయాలను చేరుకొనేందుకు వీలుగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అవసరమైతే భవిష్యత్తులో మరో నాలుగు అదనపు స్టేషన్ల నిర్మాణానికీ తగిన ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. టెండర్‌ పత్రాలన్నింటినీ తెలంగాణ ప్రభుత్వ ఇ-పోర్టల్‌ అప్‌లోడ్‌ చేస్తారు. ఇక ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అవసరమైన ఈపీసీ టెండర్‌ డాక్యుమెంట్లను తయారు చేసేందుకు జనరల్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా సిస్ట్రా, రైట్స్‌ డీబీ ఇంజినీరింగ్‌ సంస్థల కన్సార్టియంను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణంలో పలు విభాగాల్లో నిష్ణాతులైన 18మంది ఇంజినీరింగ్‌ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70మంది సీనియర్‌ ఇంజినీర్లు తదితర సిబ్బందిని కన్సార్టియం సమకూర్చుతుందని, ఈ ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ వెంటనే తన పనిని ప్రారంభిస్తుందని ఎన్వీఎస్‌ రెడ్డి గతంలో ప్రకటించారు.

Spread the love