బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌..?

– బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులతో అధికార పార్టీ నాయకుల మంతనాలు
– పదవుల ఆఫర్‌తో గాలం
– ఆర్‌ఎస్‌ ప్రవీన్‌కుమార్‌ చేరికే కారణమా?
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లలో ఒకదాన్ని కైవసం చేసుకొని బలంగానే కనిపించింది. అనంతరం సిర్పూర్‌లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌లో చేరిక పార్టీలో అగ్గి రాజేసింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, తమ్ముడు జెడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతో కలిసి అధికార పార్టీలో చేరారు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌ ఢలాీ పడింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిర్పూర్‌ నియోజకవర్గంలో అంతా తానై ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేసిన ఎమ్మెల్సీ దండే విఠల్‌ రానున్న రోజుల్లో తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటానని ఆశించారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నియోజకవర్గ రాజకీయాల్లో కలగజేసుకోవడంతో ఎమ్మెల్సీకి కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్‌ నాయకులు ఎమ్మెల్సీతో మంతనాలు జరపడంతో ఆయన పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే బీఆర్‌ఎస్‌కు భారీ నష్టం కలిగే సూచనలు కన్పిస్తున్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గంలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఎమ్మెల్సీ దండే విఠల్‌ పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పాటు ఆయన గ్రూపు వారు మాట్లాడుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మంత్రి పదవి కోసమేనా?
ఇప్పటికీ అధికార కాంగ్రెస్‌ జూలై రెండవ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో అధికార పార్టీ నాయకులతో సహా ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా పార్టీ మారి మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకరికి తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వడానికి అధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు జిల్లాలో అధికార పార్టీకి ప్రజాప్రతినిధులు లేకపోవడంతో మంత్రి పదవిపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఎమ్మెల్సీ విఠల్‌ ముందస్తుగా మంతనాలు జరిపి మంత్రి పదవి ఆశించి పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆ దిశగా అడుగులు వేస్తూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు వినిపిస్తోంది.
ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ చేరికే కారణమా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణం బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పోటీ చేయడమేనని అందరికీ తెలిసిందే. తర్వాత ప్రవీణ్‌కుమార్‌ను పార్టీలో చేర్చుకోవడంతో నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నాయకులు అనేకమంది పార్టీ మారారు. నియోజకవర్గ బాధ్యతలు తనపై వేసుకున్న ఎమ్మెల్సీ భవిష్యత్తులో తనకు అవకాశం వస్తుందని భావించినప్పటికీ ప్రవీణ్‌కుమార్‌ మళ్లీ నియోజకవర్గ రాజకీయాల్లో కల్పించుకోవడంతో ఎమ్మెల్సీకి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. భవిష్యత్తులో టికెట్‌ రాదని భావించిన ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఎమ్మెల్సీని అడగగా అధికార పార్టీ నాయకులు అందరితో మాట్లాడినట్టే తనతో మాట్లాడారని, అయితే మంత్రి పదవి లాంటివి తనతో మాట్లాడలేదని తెలిపారు. ప్రవీణ్‌కుమార్‌కు నాగర్‌కర్నూల్‌ కేటాయించినప్పటికీ సిర్పూర్‌లో తిరగడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదన్నారు. భవిష్యత్తులో కార్యకర్తల నిర్ణయం మేరకు వ్యవహరిస్తానని తెలిపారు.

Spread the love