‘పెద్దవంగర’ లో ఎనీ టైం గుడుంబా…

– తెల్లవారుజామున నుండి, అర్ధరాత్రి వరకు
– పల్లెలో విచ్చలవిడిగా గుడుంబా విక్రయాలు 
– మండలంలో జాడ లేని ఎక్సైజ్ దాడులు
– నిత్యం ఘర్షణలు, భయభ్రాంతుల్లో ప్రజలు
నవతెలంగాణ-పెద్దవంగర: పచ్చని పల్లెల్లో నాటు సారా ఏరులై పారుతుంది. గుడుంబా అమ్మకాలు మద్యం అమ్మకానికి దీటుగా సాగుతున్నాయి. మండలంలో కిరాణ దుకాణం ముసుగులో గుడుంబా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, పట్టించుకునే నాథుడే లేకుండా పోయారని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు గుడుంబాను అరికట్టాల్సిన ఎక్సైజ్ పోలీసులు అటువైపుగా కన్నెత్తి చూడకుండా, మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారు. గుడుంబాకు బానిసలై పేద, మధ్యతరగతి కుటుంబాలు చిన్నబిన్నమవుతున్నాయి. మండలంలో ఎనీ టైం గుడుంబా అందుబాటులో ఉండడంతో తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు మండలంలో గుడుంబా విక్రయాలు జోరుగా కొనసాగుతుంది. గుడుంబా బాబులు అనునిత్యం గుడుంబా సేవించి, గ్రామాల్లో గొడవలకు దిగుతున్నారు. రోజువారీ కూలీలు పనులకు వెళ్లకుండా, పుల్ గా తాగి వీధుల వెంట నానా హంగామా చేస్తున్నారు. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం కాలనీ వద్ద ఓ వ్యక్తి పై జరిగిన దాడి తో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పల్లెల్లో విచ్చలవిడిగా…
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ అనంతరం వచ్చిన టీఆర్ఎస్‌ ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపింది. గుడుంబా తయారీ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వ్యాపారులు, తయారీదారులపై ఎక్సైజ్‌శాఖ పీడీయాక్ట్‌ నమోదు చేసింది. దీంతో మండలంలో గుడుంబా పూర్తిగా తయారీ బంద్ అయింది. మళ్లీ గత కొంతకాలంగా గ్రామాల్లో గుడుంబా గుప్పుమంటుంది.
గుడుంబా అరికట్టాలి…
గ్రామాల్లో ఏరులై పారుతున్న గుడుంబాను అరికట్టాలని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో గుడుంబా తయారీ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామాల్లో పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ.. గుడుంబా నియంత్రణకు కృషి చేయాలని అభిప్రాయపడుతున్నారు.
Spread the love