తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ

నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలను చర్చించుకునేందుకు భేటీ అవుదామని లేఖలో పేర్కొన్నారు. విభజన జరిగి పదేళ్లు దాటినా కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని.. పరస్పర సహకారం.. తెలుగు ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతుందని చంద్రబాబు తెలిపారు. ఈనెల 6వ తేదీన ముఖాముఖి కలిసి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఉమ్మడి అంశాలను సామరస్య పరిష్కారానికి ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, లీడర్షిప్ తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్ద కాలం పూర్తయ్యింది. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి చాలా చర్చలు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తైతే, ఇప్పుడు జరగబోయే మన మీటింగ్ మరో ఎత్తు. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది.” అని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.

Spread the love