కొల్లూరు డీపీఎస్‌లో ఉత్సాహంగా ఆర్చరీ పోటీలు

– వరల్డ్‌కప్‌కు ఎంపికైన చికితకు సత్కారం
హైదరాబాద్‌ : రాష్ట్ర జూనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్‌ పోటీలు కొల్లూరు ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (డీపీఎస్‌)లో ఘనంగా జరిగాయి. ఇండియన్‌, రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో సుమారు 200ల మందికి పైగా ఆర్చర్లు పాల్గొన్నారు. కాంపౌండ్‌ విభాగంలో పెద్దపల్లి ఆర్చర్‌ టి.చికితరావు 697 పాయింట్లు సాధించి, స్వర్ణ పతకం కొల్లగొట్టింది. ఎన్‌.మానస (రంగారెడ్డి) రజతం, ఎం.శ్రేష్ట రెడ్డి (హైదరారాబాద్‌) కాంస్యం దక్కించుకున్నారు. గత వారం జరిగిన జాతీయ ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చి ఆర్చరీ వరల్డ్‌కప్‌, ఆసియాకప్‌కు ఎంపికైన చికితను రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు టి.రాజు, సంగారెడ్డి జిల్లా ఆర్చరీ సంఘం అధ్యక్షుడు, డీపీఎస్‌ కరస్పాండెంట్‌ టి.ఎస్‌ పవన్‌ కళ్యాణ్‌ సన్మానించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ కొల్లూరు డీపీఎస్‌లో ఆర్చరీ అకాడమీ నెలకొల్ప దేశం గర్వించే యువ ఆర్చర్లను తయారు చేస్తున్నామని రాబోయే కాలంలో రాష్ట్రం నుంచి మరింత మంది అంతర్జాతీయ స్థాయి ఆర్చర్లు వస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీపీఎస్‌ చైర్మన్‌ టి.భీమ్‌సేన్‌, వైస్‌ చైర్మన్‌ టీ.వీ ప్రణరు కుమార్‌ రాష్ట్ర ఆర్చరీ సంఘం కార్యదర్శి అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love