ఒత్తిడికి గురవుతున్నారా..?

టీనేజ్‌లో పిల్లలు ఎవరైనా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటారు. తనకంటూ వ్యక్తిగత సమయం కావాలని తపిస్తారు. తనను తాను నిరూపించుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ వయసులోనే పిల్లలకు సమాజం నుంచి కొన్ని ఒత్తిళ్లు ఎదురవుతాయి. కుటుంబం నుంచి కూడా కొన్ని వ్యతిరేకతలు ఉంటాయి. అలాగే కొందరిలో సవాళ్లను తట్టుకునే సామర్థ్యం ఉండదు. ఇలా కారణమేదైనా యుక్తవయసులోకి ప్రవేశించిన చాలామంది ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి టీనేజ్‌లో ఎదురయ్యే ఆందోళనలు, వాటికి పరిష్కార మార్గాలేంటో తెలుసుకుందాం…
ఆందోళనకు గురయ్యే పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా.. రెండు రకాలుగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే తల్లిదండ్రులే చొరవ చూపాలి. వాళ్ల ఆందోళనలకు కారణమేంటో తెలుసుకోవాలి. వారి సమస్యలను పరిష్కరించే దిశగా చేయూతనందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రధాన కారణం
టీనేజ్‌ పిల్లలు పెద్దవారిలా పరిణతితో ఆలోచించలేరు. వారు ఏది కోరుకుంటే అది జరిగి తీరాల్సిందే అన్న మొండితనం వారిలో కనిపిస్తుంటుంది. ఒకవేళ అది జరగలేదంటే మాత్రం మానసికంగా మరింతగా కుంగిపోతారు. అలాగే తోటి వారితో పోల్చుకునే మనస్తత్వం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అందం, ఆహార్యం, చర్మ ఛాయ, శరీర బరువు.. వంటి అంశాల్ని మరింత లోతుగా పరిశీలిస్తూ ఆత్మన్యూనతకు, అభద్రతా భావానికి లోనవుతుంటారు. ఇది క్రమంగా వీరిని కుంగుబాటుకు గురి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇలా పోలికే కాదు.. ఎదుటివాళ్లు తమలోని లోపాల్ని ఎత్తిచూపుతూ వేధించినా, హేళన చేసినా వీళ్లు అస్సలు తట్టుకోలేరు. టీనేజ్‌ దశలో చాలామంది కుంగుబాటుకు లోనవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నాయి పలు అధ్యయనాలు.
ఆకర్షణలకు లోననవడం
తెలిసీ తెలియని ఈ వయసులో ప్రేమలో పడడం, ఆకర్షణకు లోనవడం, టీనేజ్‌ ప్రెగెన్సీ.. ఇవి కూడా వారిని మానసికంగా కుంగదీస్తాయి. తద్వారా ఇతర లక్ష్యాలపై మనసు పెట్టకుండా అడ్డుకుంటాయి. ఈ దశలో కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోవడం, లైంగిక దాడికి గురవడం.. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారోనన్న భయమే వారిని మానసికంగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు.
ఊబిలో కూరుకోకముందే
సోషల్‌ మీడియా మితంగా వాడితే ఎంత ఉపయోగకరమో.. అతిగా వాడితే అంతే అనర్థం. ముఖ్యంగా టీనేజ్‌ పిల్లలు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగిస్తూ.. వారు పెట్టే పోస్టులకు ఆశించిన కామెంట్లు, లైకులు రాకపోవడం వల్ల కూడా డిప్రెషన్‌కి లోనవుతున్నారని పలు అధ్యయనాలు రుజువు చేశాయి. అలాగే శారీరకంగా, మానసికంగా ఎదిగే ఈ యుక్త వయసులో ఒత్తిడి, ఆందోళనలకు గురవడం వల్ల దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వారు ఈ ఊబిలోకి కూరుకుపోకముందే తల్లిదండ్రులు పిల్లల్లోని డిప్రెషన్‌ను పసిగట్టాలని అంటున్నారు.
ఇలా తెలుసుకోవచ్చు..?
కొంత మంది పిల్లలు ఉన్నట్లుండి అకారణంగా ఏడుస్తుంటారు. అలాగే నలుగురితో కలవకుండా ఎప్పుడూ ఒంటరిగా, ఏదో ఆలోచిస్తుంటారు. వారి మాటల్లో వైరాగ్యం, నిరాశానిస్పృహలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. చిన్న విషయాలకే కోపం, చిరాకు తెచ్చుకుంటుంటారు. ఎదుటివారిపై అకారణంగా అరస్తుంటారు. ఎక్కువగా నిద్రపోవడం, లేదంటే నిద్రలేమి కూడా ఈ లక్షణాలే. అలాగే సరిగా తినకపోవడం, చదువులో మెరుగ్గా రాణించకపోవడం, విచక్షణ, ఆలోచనా శక్తి కోల్పోయి తమకు తామే హాని చేసుకుంటుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు తీవ్రమైతే.. ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నాలకు కూడా వెనకాడకపోవచ్చు.. కాబట్టి టీనేజ్‌ పిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెట్టడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
ఓటమిని తట్టుకోలేక…
యుక్త వయసులోకి ప్రవేశించిన వారి శరీరంలో పలు మార్పులు చోటుచేసుకోవడం, హార్మోన్ల స్థాయుల్లో హెచ్చుతగ్గులు.. వంటివి కూడా వారిలో మానసిక సమస్యలకు కారణమవుతున్నాయి. కొంతమంది చిన్నతనం నుంచే చదువు, కెరీర్‌, ఇతర భవిష్యత్‌ లక్ష్యాలపై స్పష్టమైన అవగాహనతో ఉంటారు. అయితే ఒక్కోసారి మనం అనుకున్న స్థాయిలో రాణించలేకపోవచ్చు. అలాంటప్పుడు ఓటమిని తట్టుకోలేక మానసిక కుంగుబాటుకు లోనయ్యే వారూ లేకపోలేదంటున్నారు నిపుణులు.

భరోసా ఇవ్వండి
డిప్రెషన్‌లో కూరుకుపోయిన పిల్లల్ని అందులో నుంచి బయటికి తీసుకురావడానికి తల్లిదండ్రులే చొరవ చూపాలంటున్నారు నిపుణులు. పిల్లలదే తప్పైనా సరే వారిని మందలించడం, కోప్పడడం, అసహ్యించుకోవడం లాంటివి చేయకుండా వారిని దగ్గరికి తీసుకోవాలి. పొరపాటు ఎలా జరిగిందో తెలుసుకొని దానికి పరిష్కారం వెతికే దిశగా ఆలోచిస్తే పిల్లలకి ఎంతో ఊరటగా ఉంటుంది. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటే ఇలాంటి సమస్యలు చాలావరకు తలెత్తవంటున్నారు నిపుణులు. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మీరు మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా.. మీ పిల్లల కోసం తగినంత సమయం కేటాయించండి. అన్ని విషయాలు పంచుకోవడం, తెలుసుకోవడం చాలా మంచిది. టీనేజ్‌ వయసుకొచ్చిన అమ్మాయిల్లో జరిగే శారీరక మార్పుల గురించి తల్లులు ముందే వారికి అర్థమయ్యేలా చెప్తే.. వారు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా జాగ్రత్తపడచ్చు. కొన్ని రకాల థెరపీలు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టి వారి సలహా మేరకు ప్రారంభంలోనే చికిత్స చేయిస్తే పిల్లలు త్వరగా మళ్లీ గాడిలో పడతారు.

Spread the love