కౌలాలంపూర్: ప్రపంచకప్ జూనియర్ హాకీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో భాగంగా మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో అరైజిత్‌సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో భారత్ 4-2గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను చిత్తుచేసింది. అరైజిత్‌సింగ్ హ్యాట్రిక్ గోల్స్‌కి తోడు అమన్‌దీప్ మరో గోల్ చేశాడు. అరైజిత్ 11, 16, 41వ ని.లో గోల్స్ కొట్టగా.. అమన్‌దీప్ 30వ ని.లో మరో గోల్ చేశాడు. ఇక కొరియా తరఫున లిమ్(38వ ని.), కిమ్ (45వ ని.)లో ఒక్కో గోల్ కొట్టారు. ఇదే గ్రూప్‌లో ఉన్న స్పెయిన్ జట్టు 7-0తో కెనడాను చిత్తుచేసింది. దీంతో ఈ గ్రూప్‌లో స్పెయిన్, ఇండియా మూడేసి పాయింట్లతో టాప్‌లో కొన సాగుతున్నాయి. ఇక గ్రూప్-ఏలో అర్జెంటీనా 1-0తో ఆస్ట్రేలియాను చిత్తుచేయగా.. గ్రూప్- బిలో జర్మనీ 5-3గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాపై, ఫ్రాన్స్ 3-1గోల్స్‌తో ఈజిప్ట్‌ను ఓడించాయి.