మాజీ సర్పంచుల అరెస్టు

Arrest of ex-serpents– ఖండించిన మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తమ పెండింగ్‌ బిల్లులు విడుదల చేయించేందుకు అసెంబ్లీలో మాట్లాడాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు సర్పంచుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం అసెంబ్లీకి బయలుదేరిన మాజీ సర్పంచులను సిటీ కమిషనరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సందర్భంగా జేఏసీ అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్‌ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేయాలనే ఉద్దేశంతో శాంతియుతంగా వెళ్తుంటే తమను ఎక్కడిక్కడ అరెస్టు చేయడం బాధాకర మన్నారు. నిర్బంధాలతో, అరెస్టులతో సర్పంచుల ఉద్యమాలు ఆపలేరని స్పష్టం చేశారు. తమకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల పై అసెంబ్లీ సమావేశంలో చర్చించి తమకు అండగా నిలవాలని ఎమ్మెల్యే లను కోరారు. ప్రతిరోజు ఆందోళన కార్యక్రమా లుంటాయని ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్‌ రెడ్డి, మధు, మల్లయ్య, సుభాష్‌ గౌడ్‌, జయలక్ష్మి, శారద, కుమార స్వామి తదితరుల పాల్గొన్నారు. సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డిని తెల్లవారుజామునే ముందస్తుగా అరెస్టు చేసి ఐఎస్‌ సదన్‌ పీఎస్‌కు తరలించారు. మండ లాల్లో ఎక్కడికక్కడ మాజీ సర్పంచులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ సర్పంచులకు ఇచ్చే గౌరవం ఇదేనా?
పెండింగ్‌ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాదిగా మాజీ సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉత్తమ గ్రామాలకు తెలంగాణ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచా యతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకమని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తున్న రాష్ట్ర సర్కారుకు మాజీ సర్పంచులకు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావడం లేదని నిలదీశారు. సీఎంగానీ, పంచాయతీ శాఖ మంత్రిగానీ మాజీ సర్పంచులను చర్చలకు పిలవాలనీ, వారి పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని కోరారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love