ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహం ఏర్పాటు చేయకపోతే
సంఘమే ప్రతిష్టిస్తుంది
ఎక్స్‌గ్రేషియా బకాయిలు విడుదల చేయాలి
’అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర’లో ప్రభుత్వానికి కల్లుగీత కార్మిక సంఘం హెచ్చరిక
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేసి అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల రమణ హెచ్చరించారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం చేపట్టిన “అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర” గురువారం నల్లగొండకు చేరుకుంది. క్లాక్‌టవర్ సెంటర్‌లో మహనీయుల విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా టీఎన్‌జీవో భవన్‌కు చేరుకున్నారు. జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో రమణ మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు కోసం గత ప్రభుత్వం నిధులు కేటాయించి జీవో జారీ చేసినప్పటికీ ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఈ నెల 18లోపు పనులు ప్రారంభించకపోతే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘమే విగ్రహాన్ని ప్రతిష్టిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలైన పెన్షన్‌ను రూ.4 వేలకు పెంచడం, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచడం, ప్రమాద బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో సాయం అందించడం వంటి హామీలు అమలు కాలేదన్నారు. ప్రమాదాల్లో మృతిచెందిన, గాయపడిన గీత కార్మికులకు అందాల్సిన సుమారు రూ.20 కోట్ల ఎక్స్‌గ్రేషియా బకాయిలను వెంటనే విడుదల చేయాలని, 50 ఏండ్లు దాటిన ప్రతి గీత కార్మికుడికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ యాత్ర రాజకీయాల కోసం కాదని, గీత కార్మికుల హక్కులు, అమరుల త్యాగాల స్ఫూర్తిని కొత్త తరానికి చేరవేయడానికేనని చెప్పారు. నల్లగొండ జిల్లా గీత కార్మికుల ఉద్యమాలకు చారిత్రక కేంద్రంగా నిలిచిందని, మరోసారి ఇక్కడి నుంచే ఉద్యమానికి నాంది పలుకుతామని చెప్పారు. కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని సమాజానికి చాటడంలో కల్లుగీత కార్మిక సంఘం కీలక పాత్ర పోషించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహానికి రూ.3 కోట్ల నిధులు కేటాయించామని గుర్తుచేశారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభలో చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ, యాత్ర బృందం సభ్యులు ఎలుగురి గోవిందు, గౌలి వెంకన్న, బాల్య వెంకటమల్లయ్య, వి.వెంకటనరసయ్య, గౌని సాంబయ్య, చెరుగోని సీతారాములు, మడ్డి అంజిబాబు, జిల్లా గౌరవాధ్యక్షులు పామనగుండ్ల అచ్చాలు, రాచకొండ వెంకట్ గౌడ్, పాలకూరి జగన్, ఉప్పల గోపాల్ పాల్గొన్నారు.
హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీ ముట్టడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



