– మెల్‌బోర్న్‌లో తెలుగోడి అజేయ శతకం
– వాషింగ్టన్ సుందర్ అర్థ సెంచరీ
– భారత్ తొలి ఇన్నింగ్స్ 358/9
– బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు
బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు. రిషబ్ పంత్ నిష్క్రమణతో 55.4 ఓవర్లలో భారత్ 191/6. తొలి ఇన్నింగ్స్‌లో మరో 283 పరుగుల వెనుకంజ, ఫాలోఆన్ గండం గట్టెక్కేందుకు మరో 85 పరుగుల వెనుకంజ. టీమ్ ఇండియా చేతిలో చివరి నాలుగు వికెట్లు. స్పెషలిస్ట్ బ్యాటర్లు అందరూ పెవిలియన్‌కు చేరటంతో.. ఆల్‌రౌండర్లు మాత్రమే క్రీజులో ఉన్నారు. మెల్‌బోర్న్‌లో ఫాలోఆన్ గండం తప్పేలా లేదు అనుకున్నారు.
భారత ఇన్నింగ్స్‌ను ముగించాలనే ఉత్సాహంలో ఉన్న కంగారూ బౌలర్లకు.. ఓ తెలుగోడు సవాల్ విసిరాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరన వచ్చినా.. ఆసీస్‌కు చుక్కలు చూపించాడు. సహనం, దూకుడు, ప్రణాళికతో కూడిన అద్భుత ఇన్నింగ్స్‌ను ఆవిష్కరించాడు నితీశ్ కుమార్ రెడ్డి. అజేయ సెంచరీ సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి మెల్‌బోర్న్‌లో టీమ్ ఇండియాను ఒంటిచేత్తో ఆదుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్ సైతం ఓ పంచ్ విసిరే స్థాయిలో నిలబెట్టాడు. వాషింగ్టన్ సుందర్ (50) అండతో ఎదురుదాడికి నాయకత్వం వహించాడు.
నవతెలంగాణ-మెల్‌బోర్న్
తెలుగు తేజం కాకి నితీశ్ కుమార్ రెడ్డి (105 బ్యాటింగ్, 176 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. బాక్సింగ్ డే టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉండగా క్రీజులోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి.. వాషింగ్టన్ సుందర్ (50, 162 బంతుల్లో 1 ఫోర్) తోడుగా 127 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించాడు. నితీశ్, సుందర్ అసమాన ప్రదర్శనతో మూడో రోజు ఆటలో భారత్ బలంగా పుంజుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 358/9 పరుగులు చేసింది. అయినా, తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా మరో 116 పరుగుల వెనుకంజలోనే కొనసాగుతుంది. ఆసీస్ బౌలర్లు స్కాట్ బొలాండ్ (3/57), పాట్ కమిన్స్ (3/86), నాథన్ లయాన్ (2/88) రాణించారు. వర్షం, వెలుతురు లేమి కారణంగా మూడో రోజు ఆటలో పూర్తి ఓవర్లు సాధ్యపడలేదు. ఈ లోటు పూడ్చేందుకు నేడు ఆట ఓ అర గంట ముందుగా ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 4.30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
పంత్, జడేజా ప్చ్
ఓవర్‌నైట్ బ్యాటర్లు రిషబ్ పంత్ (28, 37 బంతుల్లో 3 ఫోర్లు), రవీంద్ర జడేజా (17, 51 బంతుల్లో 3 ఫోర్లు) నిరాశపరిచారు. ఈ జోడీ పది ఓవర్ల పాటు వికెట్ల పతనాన్ని నిలువరించి 32 పరుగులు జోడించినా… బాధ్యతగా ఆడలేదు. బొలాండ్ బౌలింగ్‌లో స్కూప్ షాట్‌కు వెళ్లిన పంత్ అనవసరంగా వికెట్ పారేసుకున్నాడు. అప్పటికి భారత్ స్కోరు 55.4 ఓవర్లలో 191. పంత్ ఓవర్‌నైట్ స్కోరుకు 18 పరుగులే జోడించాడు. రవీంద్ర జడేజా సైతం అంచనాలను అందుకోలేదు. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 13 పరుగులే జత చేశాడు. పంత్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం నితీశ్.. జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించాడు. జడేజా సైతం వికెట్ కోల్పోవటంతో.. వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. లంచ్ విరామ సమయానికి భారత్ 244/7తో నిలిచింది.
నితీశ్, సుందర్ షో
నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ జోడీపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఈ ఇద్దరు బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. పెర్త్ టెస్టు నుంచీ నితీశ్ నిలకడగా రాణిస్తున్నాడు. అయినా, అతడి బ్యాటింగ్ సామర్థ్యంపై పలు అనుమానాలు. మెల్‌బోర్న్‌లో ఆ అనుమానాలను పటాపంచలు చేసే ఇన్నింగ్స్ బాదాడు నితీశ్. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 81 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన నితీశ్ కుమార్.. ఏ దశలో అవసరం లేని దూకుడు చూపించే ప్రయత్నం చేయలేదు. వాషింగ్టన్ సుందర్ సైతం ఆసీస్ గడ్డపై మరో స్ఫూర్తిదాయక అర్థ సెంచరీ అందుకున్నాడు. 162 బంతుల్లో ఒక్క ఫోర్ మాత్రమే బాదిన సుందర్.. 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. నితీశ్, సుందర్ జోడీ లంచ్ విరామం తర్వాత అద్భుతంగా ఆడారు. దీంతో భారత్ టీ విరామానికి 326/7తో మెరుగ్గా కనిపించింది. నితీశ్, సుందర్‌లు ఎనిమిదో వికెట్‌కు 285 బంతుల్లో 127 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఇందులో సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేయగా.. నితీశ్ 123 బంతుల్లో 75 పరుగులు పిండుకున్నాడు.
సెంచరీ హైడ్రామా
అర్థ సెంచరీ తర్వాత వాషింగ్టన్ సుందర్ (50) వికెట్ కోల్పోయాడు. లయాన్ మాయకు స్లిప్స్‌లో క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. అప్పటికి భారత్ స్కోరు 348/8. జశ్‌ప్రీత్ బుమ్రా (0) మూడు బంతుల్లోనే కమిన్స్‌కు వికెట్ కోల్పోయాడు. 350/9తో భారత్ ఆలౌట్ ముంగిట నిలువగా.. మరో ఎండ్‌లో నితీశ్ 99 పరుగుల వద్ద నిలిచాడు. ఈ సమయంలో మహ్మద్ సిరాజ్ (2 నాటౌట్) కమిన్స్‌ను నిలువరించాడు. స్కాట్ బొలాండ్ బంతి అందుకోగా.. స్ట్రయిక్ తీసుకున్న నితీశ్ సూపర్ బౌండరీతో శతకం అందుకున్నాడు. 21 ఏండ్లకే వంద మార్క్ అందుకుని.. ఈ ఘనత సాధించిన భారత మూడో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వర్షంతో ఆట నిలిచిపోయింది. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ 358/9తో నిలిచింది. నితీశ్, సిరాజ్‌లు అజేయంగా ఆడుతున్నారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 474/10
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (రనౌట్) 82, రోహిత్ శర్మ (సి) బొలాండ్ (బి) కమిన్స్ 3, కెఎల్ రాహుల్ (బి) కమిన్స్ 24, విరాట్ కోహ్లి (సి) అలెక్స్ (బి) బొలాండ్ 36, ఆకాశ్ దీప్ (సి) లయాన్ (బి) బొలాండ్ 0, రిషబ్ పంత్ (సి) లయాన్ (బి) బొలాండ్ 28, రవీంద్ర జడేజా (ఎల్బీ) లయాన్ 17, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ 105, వాషింగ్టన్ సుందర్ (సి) స్మిత్ (బి) లయాన్ 50, జశ్‌ప్రీత్ బుమ్రా (సి) ఖవాజా (బి) కమిన్స్ 0, మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్ 2, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (116 ఓవర్లలో 9 వికెట్లకు) 358.
వికెట్ల పతనం: 1-8, 2-51, 3-153, 4-154, 5-159, 6-191, 7-221, 8-348, 9-350.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 25-2-86-0, పాట్ కమిన్స్ 27-6-86-3, స్కాట్ బొలాండ్ 27-7-57-3, నాథన్ లయాన్ 27-4-88-2, మిచెల్ మార్ష్ 7-1-28-0, ట్రావిశ్ హెడ్ 3-0-11-0.
పుష్ప, బాహుబలి!
83 వేల మంది అశేష అభిమానులు. మెల్‌బోర్న్ స్టేడియంలో కంగారూ అభిమానుల కోలాహలం. నిండుకుండని తలపించే స్టేడియంలో, జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉండగా కుర్ర క్రికెటర్లు నిలువటం అరుదు. తెలుగు తేజం నితీశ్ కుమార్ అసమాన ఇన్నింగ్స్‌తో క్రికెట్ విమర్శకుల మెప్పు పొందాడు. టెస్టు కెరీర్‌లో తొలి అర్థ సెంచరీ, తొలి సెంచరీ ఇక్కడే సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ రెండు సందర్భాల్లోనూ తెలుగు వైభవాన్ని చాటాడు. అర్థ సెంచరీ అనంతరం ‘పుష్ప’ అల్లు అర్జున్ శైలిలో తగ్గేదేలే అంటూ అభివాదం చేసిన నితీశ్.. బొలాండ్ ఓవర్లో బౌండరీ బాది ఐకానిక్ ‘బాహుబలి’ ప్రభాస్ అనుకరిస్తూ శతకం సంబురం చేసుకున్నాడు. బాహుబలి, పుష్ప తరహాలోనే మెల్‌బోర్న్ శతకంతో నితీశ్ కుమార్ భారత్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు.