న్యూఢిల్లీ: అరెస్టు చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత కాశ్మీరీ జర్నలిస్టు ఫహద్ షాకు శుక్రవారం జమ్మూ కాశ్మీర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన డిజిటల్ మేగజైన్లో ‘దేశద్రోహ’ వ్యాసాన్ని ప్రచురించడమే అరెస్టుకు కారణం. 2011లో ఈ వ్యాసాన్ని ప్రచురించినందుకు షాపై తీవ్రవాద అభియోగాలు మోపారు. ‘బానిస సంకెళ్లు ఛేదించాలి’ అనే శీర్షికతో ఆ వ్యాసం ప్రచురితమైంది. ఆ మేగజైన్ ఇప్పుడు మూతపడింది కూడా. కాశ్మీరీ యూనివర్శిటీకి చెందిన ఆలా ఫాజిలి అనే స్కాలర్ ఈ వ్యాసాన్ని రాశారు. ఆయన్ని ఈ కేసులో అరెస్టు చేశారు. 2022 ఏప్రిల్ 4న జమ్మూలోని సిఐజె పోలీసు స్టేషన్లో జమ్మూ కాశ్మీర్ దర్యాప్తు సంస్థ ఈ కేసు నమోదు చేసింది. మేగజైన్లో వ్యాసం ప్రచురితమైన 11 సంవత్సరాల తర్వాత ఈ కేసు నమోదు చేశారు. గతేడాది మార్చిలో చార్జిషీట్ దాఖలు చేశారు. షాపై నమోదైన ప్రజా భద్రతా చట్టం (పిఎస్ఎ)ను ఈ ఏడాది ఏప్రిల్లో హైకోర్టు కొట్టివేసింది. జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం ఆయనపై చేసిన ఆరోపణలు కేవలం ఊహాజనితంగా వున్నాయని, పైగా అస్పష్టంగా, అరకొరగా వున్నాయని వ్యాఖ్యానించింది. పైగా షా యొక్క రాజ్యాంగబద్ధమైన,చట్టబద్ధమైన హక్కులను అధికారులు లాగేసుకున్నారని వ్యాఖ్యానించింది. పిఎస్ఎ అనేది చట్టవిరుద్ధమైన చట్టమని అమ్నెస్నీ ఇంటర్నేషనల్ పేర్కొంటుంది.