Friday, June 19, 2026
E-PAPER
Homeజాతీయంకాక్రోచ్‌ వ్యవస్థాపకుడిపై దాడి కేసులో..నిందితులకు బెయిల్‌‌

కాక్రోచ్‌ వ్యవస్థాపకుడిపై దాడి కేసులో..నిందితులకు బెయిల్‌‌

- Advertisement -

విడుదలైన కాషాయమూకల ఘన స్వాగతం
జైపూర్‌ : రాజస్తాన్‌‌లోని జైపూర్‌‌లో కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కేపై జరిగిన దాడి ఘటనలో అరెస్టయిన ఐదుగురు నిందితులకు మంగళవారం బెయిల్‌ ‌లభించింది. బెయిల్‌‌పై విడుదలైన వెంటనే వారిని మద్దతుదారులు పూలమాలతో సత్కరించారు. జైశ్రీరామ్‌, భారత్‌ ‌మాతా కీ జై వంటి నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యక్తిపై దాడికి దిగి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అరెస్టయి, ఇప్పుడు బెయిల్‌‌పై విడుదలైన నిందితులకు ఈ విధంగా ఘన స్వాగతం లభించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తున్నది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌‌గా మారాయి. వివరాళ్లోకెళ్తే.. ఈనెల 15న జైపూర్‌‌లోని షహీద్‌ ‌స్మారక్‌ ‌వద్ద సీజేపీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అభిజిత్‌ ‌దీప్కేపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం పోలీసులు రోహిత్‌ ‌శర్మ, రాకేశ్‌ ‌గుజ్జర్‌, అజయ్‌ ‌వర్మ, కుల్దీప్‌ ‌సింగ్‌ ‌శేఖావత్‌, నికేత్‌‌లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని భారతీయ నాగరిక సురక్ష‍ సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌) ‌సెక్ష‍న్‌ 170 ‌కింద అరెస్ట్‌ ‌చేసినట్టు జైపూర్‌ ‌దక్ష‍ిణ విభాగ డీసీపీ రాజర్షి రాజ్‌ ‌వెల్లడించారు. అనంతరం జైపూర్‌ ‌సౌత్‌ ఎగ్జిక్యూటివ్‌ ‌మేజిస్ట్రేట్‌ ‌వారికి బెయిల్‌‌ను మంజూరు చేశారు.

నిందితులు బెయిల్‌‌పై విడుదలైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ అయ్యాయి. అందులో నిందితులకు పూల మాలలు వేస్తూ.. ‘జై శ్రీరామ్‌’, ‘హిందూ ఏక్తా జిందాబాద్‌’, ‘భారత్‌ ‌మాతా కీ జై’, ‘ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌’ వంటి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. నిందితుల్లో ఒకరైన రాకేశ్‌ ‌గుజ్జర్‌ ‌మీడియాతో మాట్లాడుతూ.. తాను జాతీయవాదినని తెలిపాడు. తాను గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ ‌సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)‌లో ప్రాథమిక శిక్ష‍ణ పొందినట్టు అంగీకరించాడు. కాగా సామాజిక మాధ్యమాల్లో రాకేశ్‌ గుజ్జర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌యూనిఫాంలో ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. మరొక నిందితుడు కుల్దీప్‌ ‌శేఖావత్‌.. ‘మేము జాతీయవాదులం’ అనే శీర్షికతో ఉన్న రీల్‌‌ను పోస్ట్‌ ‌చేశాడు. ఆయన ఫేస్‌‌బుక్‌ ‌ఖాతాలో బీజేపీ, ప్రధాని మోడీ, మాజీ ప్రధాని వాజ్‌‌పేయి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్‌‌లకు మద్దతుగా పోస్టులు ఉండటం గమనార్హం.కాగా ఈ ఘటన తర్వాత నిందితులకు జరిగిన సత్కారాన్ని చూసిన కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. దీనిని 2022లో బిల్కిస్‌ ‌బానో కేసులో దోషులుగా తేలిన వ్యక్తులకు విడుదల అనంతరం జరిగిన సత్కారాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్య దేశానికి ఏ మాత్రమూ యోగ్యం కావని అంటున్నారు. హిందూత్వ శక్తుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -