హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌

హేమంత్‌ సోరెన్‌కు బెయిల్‌– తప్పు చేసినట్టు ఆధారాల్లేవ్‌ : హైకోర్టు
రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ హైకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన ఇక్కడి బిర్సాముండా జైలు నుంచి విడుదలయ్యారు. పెద్ద సంఖ్యలో జెఎంఎం నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఈ ఏడాది జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆయనను అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నెల రోజులకు పైగా ఈ కేసును విచారించిన అనంతరం జస్టిస్‌ రంగన్‌ ముఖోపాధ్యాయ సోరెన్‌ తప్పు చేసినట్లు ప్రాథమిక ఆధారాలేవీ లేవని పేర్కొంటూ ఆయనకు బెయిలు మంజూరు చేశారు. ఇడి తరవపు న్యాయవాది వాదిస్తూ సాక్షి ఇచ్చిన వాంగ్మూలమే ఆధారమని చెప్పారు. హేమంత్‌ సోరెన్‌ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంచిలో 8.86 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈడీ కేసు నమోదు చేసింది. ‘నేరం చేసినందుకు వచ్చిన లాభం’గా ఇడి చేసిన వాదనను హైకోర్టు తిరస్కరించింది. ‘పిటిషనర్‌ నేరానికి పాల్పడలేదని నమ్మడానికి కారణం వుంది.’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాంచిలోని శాంతినగర్‌లో 8.86 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడంలో సోరెన్‌కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రమేయం వున్నట్లుగా కనిపిం చడం లేదని ఈ కేసును సమగ్రంగా పరిశీలిస్తే తెలుస్తోందని పేర్కొంది. కేసు రికార్డులను, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన హైకోర్టు ‘ఈ భూమి స్వాధీనంలో ఎక్కడా పిటిషనర్‌ సోరెన్‌కు ప్రత్యక్షంగా జోక్యం వుందనిపించేలా రిజిస్టర్‌ కానీ రెవిన్యూ రికార్డులు కానీ లేవని’ పేర్కొంది. 2010లోనే ఈ భూమిని సోరెన్‌ స్వాధీనం చేసుకున్నారని సాక్షుల స్టేట్‌మెంట్లు పేర్కొంటుండగా, ‘సకాలంలో తీసుకున్న చర్య వల్ల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకో కుండా నివారించగలిగాం’ అని ఇడి చెప్పడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రూ.50వేల చొప్పున రెండు పూచీ కత్తులపై ఆయనకు బెయిల్‌మంజూరు చేసింది.

Spread the love