మద్యం ఫ్యాక్టరీలో బాలల వెట్టి

మద్యం ఫ్యాక్టరీలో బాలల వెట్టి– 50 మందిని రక్షించిన ఎన్‌సీపీసీఆర్‌ అధికారులు
– తర్వాత కనిపించని చిన్నారులు
భోపాల్‌: పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన ఆ చిట్టి చేతులు వెట్టి పనులు చేస్తున్నాయి. ఈ విషయమై ఫిర్యాదునందుకున్న నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ (ఎన్‌సీపీసీఆర్‌) ఆ ఫ్యాక్టరీపై దాడి చేసింది. అక్కడ పనిచేస్తున్న సుమారు 50 మంది బాలలను రక్షించింది. కానీ ఆ చిన్నారులంతా ఆ తర్వాత అక్కడ కనిపించకుండా పోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రైసిన్‌ జిల్లాలో జరిగింది. సెహత్‌గంజ్‌లోని సోమ్‌ డిస్టిలరీస్‌, బ్రూవరీస్‌లో బాల కార్మికులతో పనులు చేయిస్తున్నట్లు బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌ సంస్థ నుంచి తమకు ఫిర్యాదు అందిందని ఎన్‌సీపీసీఆర్‌ చైర్మన్‌ ప్రియాంక్‌ కనుంగో తెలిపారు. శనివారం తమ బందంతో కలిసి అక్కడ దాడి చేసినట్లు చెప్పారు. సుమారు 50 మంది బాల, బాలికలను రక్షించినట్లు వెల్లడించారు. కాగా, పిల్లలను స్కూల్‌ బస్సులో మద్యం ఫ్యాక్టరీకి తరలించి పనులు చేయిస్తున్నట్లు తమకు తెలిసిందని ప్రియాంక్‌ కనుంగో తెలిపారు. రసాయనాల వల్ల పిల్లల చేతులు పాడయ్యాయని అన్నారు. రక్షించిన పిల్లలను అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. కానీ కొన్ని గంటల తర్వాత ఆ పిల్లలు మద్యం ఫ్యాక్టరీ నుంచి మాయమయ్యారని ఎన్‌సీపీసీఆర్‌ చైర్మెన్‌ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌లో పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ ఈ దాడిపై స్పందించారు. కార్మిక, ఎక్సైజ్‌, పోలీసు శాఖల నుంచి పూర్తి సమాచారాన్ని కోరినట్లు తెలిపారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Spread the love