మందుల కాంబినేషన్లపై చర్యలు
సుప్రీంకోర్టు ఆదేశాలతో నిర్ణయం
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డిసి) మందులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే నిషేధం విధించింది. శాస్త్రీయ ధృవీకరణ లేని ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని నిలిపివేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26ఎ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డిటిఎబి) ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలోని మందుల ఫార్ములాలపై లోతైన శాస్త్రీయ సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే సదరు 16 రకాల కాంబినేషన్లు రోగులకు ఎటువంటి చికిత్సా ప్రయోజనాన్ని అందించడం లేదని తేలింది. వీటి వినియోగం రోగుల ఆరోగ్యానికి హానికరమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం వీటిపై నిషేధం విధించింది.
ఎక్కువగా వాడేవి ఇవే..
జాబితాలో నొప్పి నివారణా మాత్రలు
చర్మవ్యాధుల మందులు, నొప్పి నివారణా మాత్రలు, యాంటీ బయోటిక్స్, యాంటీ డయాబెటిక్ మందులతో సహా మొత్తం 16 కాంబినేషన్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. వీటిలో ప్రజలు సాధారణంగా ఎక్కువగా వాడే, సుపరిచితమైన కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి
అమోక్సిసిలిన్ + సెరాటియోపెప్టిడేస్ చాలా సాధారణంగా వాడే యాంటీబయోటిక్ కాంబినేషన్. అమోక్సిసిలిన్ అనేది ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి, సెరాటియోపెప్టిడేస్ అనేది వాపును తగ్గించడానికి వాడతారు. పంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్లు లేదా శస్త్రచికిత్స తర్వాత వాపు తగ్గడానికి వైద్యులు వీటిని సూచిస్తుంటారు.
డైసైక్లోమైన్ + పారాసెటమాల్ + క్లిడినియం బ్రోమైడ్ ను కడుపునొప్పి, కడుపులో తిమ్మిర్లు, ప్రేగు సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు.
పారాసెటమాల్ + లిగ్నోకైన్ పారాసెటమాల్‌ను నొప్పి, జ్వరం తగ్గించడానికి, లిగ్నోకైన్‌ను నొప్పి ఉన్న చోట మొద్దుబారేలా చేయడానికి ఉపయోగిస్తారు. ఇది కొన్ని రకాల నొప్పి నివారణ మందులలో ఉంటుంది. అలోవెరా బేస్డ్ కాంబినేషన్లు ఇవి చర్మ సంరక్షణ కోసం వాడే క్రీములు, లోషన్లలో ఎక్కువగా కనిపిస్తాయి.
వీటిని చర్మం మృదువుగా ఉండటానికి లేదా మంట తగ్గించడానికి ఉపయోగి స్తారు.శాస్త్రీయంగా ధృవీకరించబడిన, రోగులకు సురక్షిత మైన మందుల వాడకాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. గతంలో కూడా హేతుబద్ధత లేని ఇటువంటి అనేక మందుల కాంబినేషన్లపై ప్రభుత్వం ఇదే తరహాలో నిషేధం విధించిన సంఘటనలు ఉన్నాయి.
16 రకాల ఔషధాలపై నిషేధం
- Advertisement -
- Advertisement -



